విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి తెదేపాకే చెందిన ఒక నేత మూల్యం చెల్లించవలసి వచ్చింది.విశాఖ ఏజన్సీ ప్రాంతంలో జికె.వీధి మండలంలో జెర్రిల గ్రామం మాజీ సర్పంచ్ సాగిన వెంకట రమణను మావోయిష్టులు ఈరోజు హత్య చేసారు. అతను సర్పంచ్ గా ఉన్నపుడు బాక్సైట్ తవ్వకాలకు పంచాయితీ చేత ఆమోదముద్ర వేయించారనే కారణంగా హతమార్చినట్లు మావోయిష్టులు గ్రామస్తులకు తెలియజేసారు. అయితే పంచాయితీలో అటువంటి తీర్మానమేదీ ఆమోదించలేదని జెర్రిల గ్రామ పంచాయితీ సభ్యులు చెప్పడం గమనార్హం.
మావోయిష్టులు నిన్ననే విశాఖ ఏజన్సీ ప్రాంతంలో మంచంగిపుట్టు మండలంలోని బూసిపుత్తు అనే గ్రామానికి చెందిన పంగి శివయ్య అనే గిరిజనుడిని పోలీస్ ఇన్ఫార్మర్ అని ఆరోపిస్తూ సరియాపల్లి గ్రామం వద్ద కాల్చి చంపారు. కొన్ని రోజుల క్రితం అదే ప్రాంతంలో తెదేపాకు చెందిన నలుగురు మండలస్థాయి నేతలను మావోయిష్టులు అపహరించుకొనిపోయారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ అందరూ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని హెచ్చరికలు జారీ చేసి విడిచిపెట్టేసారు. వారిలో మణికుమారి అనే మహిళ వెంటనే తన పదవికి రాజీనామా చేసారు.
ఈరోజు మావోయిష్టుల చేతిలో హత్యకాబడిన వెంకట రమణ (38) మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కూడా పని చేసారు. బాక్సైట్ తవ్వకాలకు ఎవరు సహకరించినా వారికి ఇదే గతి పడుతుందని మావోయిష్టులు హెచ్చరించారు.
విశాఖ ఏజన్సీలో బాక్సైట్ తవ్వకాలు చేయాలని గత ప్రభుత్వాలు కూడా ప్రయత్నించాయి. కానీ ప్రతిపక్షాలు, గిరిజనులు, మావోయిష్టులు, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గాయి. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన తెదేపాయే ఇప్పుడు స్వయంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసి తీవ్ర విమర్శలు మూటగట్టుకొంది. ప్రతిపక్షాలు, గిరిజనులు మళ్ళీ తీవ్రంగా వ్యతిరేకించడంతో తెదేపా ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది కానీ బాక్సైట్ తవ్వకాల కోసం ఇచ్చిన జిఓను మాత్రం ఉపసంహరించుకోలేదు. తద్వారా ప్రభుత్వం ఇంకా ఆ ఆలోచన విరమించుకోలేదని అర్ధం అవుతోంది. గిరిజనుల శ్రేయస్సు కోసమే పోరాడుతున్నామని చెప్పుకొంటున్న మావోయిష్టులు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి గిరిజనుడినే బలి తీసుకోవడాన్ని గిరిజనులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.