ఎన్కౌంటర్ బూటకం, నిరాయుధులైన మావోయిస్టులు పోలీసులకు దొరికిపోతే….వాళ్ళను పట్టుకుని కాల్చి చంపారు, ఆర్కేను కూడా పోలీసులే నిర్బంధించారు, ఆయనను కూడా చంపేస్తారు….ఇవీ మానవహక్కులను కాపాడటం కోసం ఉన్నాం అని చెప్పుకునే వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలు. హైకోర్టుకు కూడా వెళ్ళారు. పోలీసులను రాక్షసులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజలందరికీ కూడా కొన్ని వాస్తవ విషయాలు తెలిశాయి. ఎన్కౌంటర్ నిజం అని చెప్పి మావోయిస్ట్ లీడర్ జగబంధు చెప్పుకొచ్చారు. మావోయిస్టులను పోలీసులు చుట్టుముట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులపై కాల్పులు జరిపామని, పోలీసులు ఎదురుదాడి చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన చాలా విషయాలు చెప్పారు. గాయాలైన వారిని చంపేశారని, సామాన్యులను కూడా కాల్చేశారని చెప్పాడు. ఆ విషయాలు పక్కన పెడితే కాల్పులు ఇరువైపుల నుంచీ జరిగాయన్న వాస్తవాన్ని మాత్రం ఒప్పుకున్నారు. అలాగే ఆర్కే క్షేమం అని వరవరరావు చెప్పుకొచ్చారు. అంటే ఆర్కే పోలీసుల అదపులోనే ఉన్నాడని, పోలీసులు ఆర్కేని కూడా చంపి ఉంటారని చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనన్నమాట. ఊహాగానాలతో కథలు అల్లేసి హైకోర్టుకు కూడా వెళ్ళారు.
ఇప్పుడు మొత్తం ఎపిసోడ్‌ని చూస్తూ ఉంటే ఏవోబిలో పోలీసుల టార్గెట్స్‌ని డైవర్ట్ చేయడం కోసం ఈ డ్రామా అంతా నడిపారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులను రక్షించడం కోసం పోలీసులతో మైండ్ గేం ఆడారా? అన్న సందేహాలు వస్తున్నాయి. ఇదే అభిప్రాయాలను ఎపి డిజిపి సాంబశివరావు కూడా వ్యక్తం చేశారు. తాము ముందు నుంచీ ఊహిస్తున్నదే నిజమైందని, ఇరవై ఏళ్ళుగా మావోయిస్టులు ఇదే విధమైన మైండ్ గేమ్ ఆడుతున్నారని డిజిపి విమర్శించారు. పోలీసులు తప్పులు చేయడం లేదని ఎవ్వరూ చెప్పడం లేదు. కానీ నిజాయితీగా పోరాటం చేస్తున్నాం అని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా రాజకీయ డ్రామాలు ఆడడం మాత్రం వాళ్ళ స్థాయిని తగ్గిస్తోంది.
అలాగే ఎపి డిజిపి సాంబశివరావు అడిగిన ఓ ప్రశ్నకు మావోయిస్టులు, వాళ్ళ సానుభూతి పరులు, పౌర హక్కుల సంఘాల వాళ్ళు సమాధానం చెప్పగలరా? రాజ్యాంగంపై, రాజ్యంపై నమ్మకంతో ఆర్కే కోసం కోర్టును ఆశ్రయించినవారు….ఇప్పుడు అదే నమ్మకంతో ఆర్కె ఎక్కడున్నారో చెప్పగలరా? అని డిజిపి అడిగారు. రాజ్యం లేదు, పాలన లేదు అంతా బూటకం అనేవాళ్ళు… వాళ్ళకు అవసరమైనప్పుడు మాత్రం ఆ రాజ్యాన్ని నమ్ముతారన్నమాట.