ఈ మధ్యనే, అరుకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావుతోపాటు, మరో నేతపై మావోయిస్టులు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రా కనుమరుగైపోయింది అనుకున్న మావోయిస్టుల కార్యకలాపాలు ఒక్కసారిగా తెరమీదికి వచ్చినట్టయింది. అంతేకాదు, ఇప్పటికే ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల పట్టు పెరిగిందనీ, గిరిజన గ్రామాల్లో యువతను పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకున్నారనే సమాచారం కూడా నిఘా వర్గాలకు ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో మావోయిస్టుల కన్ను తెలంగాణపై కూడా ఉందా..? అక్కడ కూడా సరిహద్దు ప్రాంతాల్లో అరుకు తరహా దాడులకు పాల్పడే అవకాశం ఉందా.. అంటే, అవుననే నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయని తెలుస్తోంది.
తెలంగాణలో కూడా తమ ఉనికి చాటుకునే దిశగా మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నారని పోలీసులను నిఘా వర్గాలు అప్రమత్తం చేసినట్టు సమాచారం. ఛత్తీస్ గడ్ తోపాటు తెలంగాణలో కూడా ముందస్తు ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఛత్తీస్ గడ్ లో మావోయిస్టుల ప్రభావం తెలిసిందే. ఆ రాష్ట్రంలో వచ్చే నెల 12న తొలి దశ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి, ముందుగా అక్కడ మావోయిస్టు ప్రభావం ఉన్న నియోజక వర్గాల్లో కొన్ని కార్యకలాపాలు చేసేందుకు వారు సిద్ధమౌతున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నట్టు సమాచారం. ఆ తరువాత, తెలంగాణలో ఎన్నికలు జరిగే నాటికి ఇక్కడ కూడా తమ వ్యూహాలు అమలు చేసే దిశగా మావోయిస్టులు వ్యూహరచన చేస్తున్నారని అనుమానం! దీంతో తెలంగాణ పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ నిఘా వర్గాలు తెలిపాయి.
తెలంగాణ- ఛత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలనీ, ఆ ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లే నేతల భద్రత విషయమై మరింత అప్రమత్తంగా ఉండాలంటే ఆయా జిల్లాల పోలీసులకు ఆదేశాలు అందినట్టు సమాచారం. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏ స్థాయి నాయకులైనా సరిహద్దు గ్రామాల్లో ప్రచారానికి వెళ్లొద్దంటూ సూచించినట్టు తెలుస్తోంది. వీటితోపాటు, మావోయిస్టుల సానుభూతిపరులు ఉండే ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల వంటి జిల్లాల ఎస్పీలకు ఇప్పటికే డీజీపీ నుంచి ఆదేశాలు అందినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి, తెలంగాణ ముందస్తు ఎన్నికల నిర్వహణలో ఇప్పుడు మావోయిస్టుల టెన్షన్ కూడా అదనంగా తోడైనట్టుగా కనిపిస్తోంది.