కాల్పుల విరమణ చేస్తామని..ప్రభుత్వం శాంతి చర్చలకు అంగీకరించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. శాంతి చర్చలకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సానుకూల వాతావరణం కల్పించాలని వారు కోరారు. కగార్ పేరుతో నిర్వహిస్తున్న ఆపరేషన్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో మావోయిస్టులను ఇష్టం వచ్చినట్లుగా చంపుతున్నారని ఆ ఆపరేషన్ ఆపేయాలని డిమాండ్ చేశారు.
అయితే శాంతి చర్చలకు మావోయిస్టుల పిలుపు ఇప్పటికే బాగా ఆలస్యం అయిందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు మావోయిస్టులు ఎక్కడైనా తూటా పేలిస్తే.. వారిని వెంటాడటానికి పోలీసులు రెడీగా ఉన్నారు. ఇప్పుడు వారికి శాంతి తప్ప మార్గ లేదు. కానీ అమిత్ షా మాత్రం వారితో చర్చలు జరపాలంటే.. ముందు వారు ఉండాలి కదా అన్నట్లుగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఓ టార్గెట్ పెట్టుకుని ఆ లోపు అసలు మావోయిస్టులు లేకుండా చేస్తామంటున్నారు. వరుసగా ఎన్ కౌంటర్లు చేస్తూ పోతున్నారు.
మావోయిస్టు అగ్రనేతల్ని చంపేసినా మవోయిస్టులకు కనీస సానుభూతి లభించడం లేదు. పెద్దగా చర్చనీయాంశం కావడం లేదు. మావోయిస్టుల ఎన్ కౌంటర్ అనేది సాదాసీదా వార్తలా మారిపోయింది. చనిపోతున్న సీనియర్లు అంతా తమ జీవితాలను నక్సలిజం కోసం ధారబోసినా.. పట్టించుకునేవారు లేరు. గతంలో ఇలా ఉండేది కాదు. ఎవరైనా మావోయిస్టును ఎన్ కౌంటర్ చేస్తే చాలా పెద్ద రచ్చ అయ్యేది. పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో మావోయిస్టులు బలహీనపడ్డారు. పదుల సంఖ్యలో వారిని ఎన్ కౌంటర్ చేస్తున్నా.. ఎవరూ కాపాడలేకపోడం కాదు.. అసలు వారికి మద్దతుగా కూడా మాట్లాడలేకపోతున్నారు.