హైదరాబాద్: మావోయిస్టులు పొరపాటు చేశామని అంగీకరించారు. పశ్చిమబెంగాల్లో సీపీఎమ్ పాలనపోయి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంవస్తే బాగుంటుందని గుడ్డిగా నమ్మి మోసపోయాని మావోయిస్టులు ప్రకటించారు. మావోయిస్టు తూర్పువిభాగ కేంద్ర కమిటీ రూపొందించిన ఆరుపేజీల సమీక్షా నివేదికలో ఈ మేరకు అంగీకరించారు. అరాచకాలకు పాల్పడుతున్న సీపీఎమ్ నేతలను చంపి వారి మృతదేహాలను పాతిపెట్టామని, అలా కాకుండా వారు చేసిన తప్పులను ప్రజలకు బహిరంగంగా వెల్లడించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. లాల్‌గఢ్‌లో ఉద్యమసమయంలో పొరపాట్లు చేశామన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జంగల్ మహల్ ప్రాంతంలో సంయుక్త భద్రతా బలగాలను ఉపసంహరించుకుంటుదని, జైళ్ళనుంచి రాజకీయ ఖైదీలను విడుదల చేస్తుందని గుడ్డిగా నమ్మామని ప్రకటించారు. మరోవైపు, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజామద్దతు కోల్పోయిన మావోయిస్టులు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తృణమూల్ ఎంపీ సుబేందు అధికారి అన్నారు. కిషన్‌జీని చంపితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తృణమూల్ ప్రభుత్వం భావించిందని, పైగా అభివృద్ధి హామీలను విస్మరించిందని సీపీఎమ్ నేత సలీమ్ విమర్శించారు. నాటి రహస్యాలను మావోయిస్టులు నేడు వెల్లడిస్తున్నారని చెప్పారు.