టీడీపీ ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోములను మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రా – ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత అప్రమత్తం చేశారు. రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి, ప్రముఖ నేతలంతా ప్రజల్లోనే ఉంటారు కాబట్టి… మావోయిస్టుల చర్యలేవైనా ఉంటాయనే అనుమానాలు పెరిగాయి. దీని తగ్గట్టుగానే ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో శుక్రవారం ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ప్రత్యేక బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన బెజ్జంగి – పనసపుట్టిల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం పోలీసులు అందించడంతో వెంటనే కూంబింగ్ ప్రారంభించారు. దీన్లో భాగంగా ఆండ్ర సమీపంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారనీ, ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించగా.. వీరిలో ఒకరు మహిళా మావోయిస్టు మీనా మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. ఈమె, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కూడా మావోయిస్టుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కిడారు సర్వేశ్వరరావు, సివేరు సోముల జంట హత్య కేసులో ఈమె పేరు కూడా ముద్దాయిల జాబితాలో ఉండటం గమనార్హం. గతంలో ఈమెపై రూ. 8 లక్షల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు.
మావోయిస్టులకు చెందిన దాదాపు 40 మంది అగ్రనేతలు ఈ ప్రాంతంలో సమావేశం నిర్వహించినట్టుగా కథనాలు వస్తున్నాయి. చలపతి, అరుణ, మావోయిస్టుల అగ్రనేత ఆర్కే కూడా ఈ మీటింగ్ వచ్చారని అంటున్నారు! అయితే, దీనికి సంబంధించిన కీలక సమాచారం అందడంతోనే పోలీసులు రంగంలోకి దిగారని అంటున్నారు. అయితే, మావోయిస్టుల కీలక నేతలంతా ఏవోబీలో ఈ సమావేశం ఎందుకు నిర్వహించారు, దీని అజెండా ఏంటీ, ఇంత పెద్ద ఎత్తున సమావేశాలు ఆంధ్రా సరిహద్దుల్లో జరుగుతున్నాయంటే… మావోయిస్టుల కార్యకలాపాలు ఏ స్థాయిలో ఉన్నాయి… ఇలాంటి అనుమానాలకు తాజా ఉదంతం ఆస్కారం ఇస్తోంది. అరుకు ప్రాంతంలో జంట హత్యల తరువాత మావోయిస్టుల అలికిడి ఎక్కువైందని నిఘా వర్గాలు చెప్పిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే తాజా కూంబింగ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.