లాక్ డౌన్ తరవాత.. తెలుగు చిత్రసీమ మంచి జోష్‌లోకి వచ్చింది. వరుస సినిమాలు బాక్సాఫీసు దగ్గర క్యూ కట్టడంతో కొత్త కళ కనిపించింది. మార్చిలో అయితే…. వారానికి మూడు నాలుగు సినిమాలు వరుస కట్టాయి. ఈ నెలలో… దాదాపుగా 20 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే… ఒకే ఒక్క సూపర్ హిట్ ని టాలీవుడ్ తన ఖాతాలో వేసుకుంది. అదే… జాతి రత్నాలు. శ్రీకారం జస్ట్ ఓకే అనిపించుకుంటే, గాలి సంపత్, చావు కబురు చల్లగా, మోసగాళ్లు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.
మార్చి 5న ఏకంగా 5 సినిమాలొచ్చాయి, అందులో `ఏ 1 ఎక్స్‌ప్రెస్`కే ఓపెనింగ్స్కాస్త బాగున్నాయి. అయితే… ఆ జోరుని ఈసినిమా కొనసాగించలేకపోయింది. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన చిన్న సినిమా `షాదీ ముబారక్` ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. `పవర్ ప్లే`తో రాజ్ తరుణ్‌కి మరో ఫ్లాప్ పడింది. మార్చి 11న కూడా బాక్సాఫీసు హోరెత్తింది. ఒకేసారి మూడు సినిమాలొచ్చాయి. శ్రీకారం, జాతి రత్నాలు, గాలి సంపత్. ఇందులో జాతి రత్నాలు సూపర్ హిట్ గా నిలిచింది. రెట్టింపు లాభాల్ని పొందింది. అనిల్ రావిపూడి నిర్మాతగా మారి తెరకెకం్కించిన `గాలి సంపత్` ఫ్లాపైంది. `శ్రీకారం`కి మౌత్ టాక్ బాగున్నా.. బాక్సాఫీసు దగ్గర జోష్ లేకుండా పోయింది.
ఈనెల 19న కూడా మూడు సినిమాలొచ్చాయి. చావు కబురు చల్లగా, శశి, మోసగాళ్లూ విడుదలయ్యాయి. చావు కబురు చల్లగా మాత్రమే కాస్తో కూస్తో ఓపెనింగ్స్ సంపాదించుకుంటే, మిగిలిన రెండూ డిజాస్టర్లు. చివరికి చావు కబురు చల్లగా కూడా ఆ లిస్టులో చేరిపోయింది. జీఏ 2 సంస్థకు ఇది భారీ దెబ్బ. ఈనెల ఆఖరి వారంలోనూ హ్యాట్రిక్ సినిమాలొచ్చాయి. అందులో రంగ్ దే ఒకటి. నితిన్ – కీర్తిల సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ తెచ్చుకోవడం చాలా కష్టమని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. రాజమౌళి, ఎన్టీఆర్‌లు భారీ ప్రచారం చేసినా `తెల్లవారితే గురువారం` కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. ఇక రానా చాలా కష్టపడి చేసిన `అరణ్య` కూడా ప్రభావం చూపించలేకపోయింది.