పరీక్షలు అయిపోయాయి. కాలేజీలకు సెలవలు ఇచ్చేశారు. ఇప్పుడు కుర్రాళ్లంతా ఖాళీగా ఉన్నారు. వాళ్లకు ఈ వేసవిలో సరిపడినంత కాలక్షేపం దొరకబోతోంది. ఓ వైపు ఐపీఎల్ ఉండనే ఉంది. దానికి తోడు థియేటర్ల దగ్గర కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. స్టార్ హీరోల చిత్రాలు లేట్ అవుతున్నాయి కానీ, బాక్సాఫీసు దగ్గర వినోదానికి కొదవ లేదు. ప్రతీవారం కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. గతవారం వచ్చిన `కోర్ట్` తన ఆధిపత్యం చూపించింది. చిన్న సినిమానే అయినా, మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈవారం కూడా చిన్న సినిమాలు జోరుగా విడుదల కాబోతున్నాయి.
సప్తగిరి కథానాయకుడిగా అవతారం ఎత్తిన సినిమా ‘పెళ్లికాని ప్రసాద్’. ఎస్వీసీ సినిమా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం విశేషం. సప్తగిరిలో మంచి కామెడీ టింజ్ వుంది. దాన్ని వాడుకొంటే కాలక్షేపానికి ఢోకా ఉండదు. ప్రభాస్, వెంకటేష్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. అది ఈ సినిమాకు ప్లస్. 21న విడుదల అవుతోంది.
‘కోర్ట్’ సినిమాతో ఆకట్టుకొన్న హర్ష్ రోషన్ ఈవారం మరో సినిమాతో వస్తున్నాడు. అదే ‘టుక్ టుక్’. ముగ్గురు స్నేహితుల కథ ఇది. ఆ ముగ్గురూ ఓ బండి తయారు చేసుకొంటారు. ఆ బండిలో దైవత్వం ఉందని నమ్ముతారు. ఆ టుక్ టుక్ బండి జాతకాలు చెబితే ఎలా ఉంటుందన్న వెరైటీ కాన్సెప్టుతో ఈ కథ తయారు చేశారు. టీజర్, ట్రైలర్ బాగున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘షణ్ముఖ’ ఈవారం వస్తోంది. ఇది డివోషనల్ టచ్ ఉన్న కథ. డైరెక్టర్ పేరు కూడా షణ్ముఖనే. ఆది ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. పోలీస్ పాత్రలంటే… సాయికుమార్ గుర్తొస్తారు. మరి ఆయన వారసుడు ఈ పాత్రకు ఎంత వరకూ న్యాయం చేశాడో తెలియాలంటే 21 వరకూ ఆగాలి.
వీటితో పాటు ‘ఆస్ట్రేలియాలో’, ‘సస్పెక్ట్’, ‘ఆర్టిస్ట్’, ‘కిస్ కిస్ కిస్సాక్’ చిత్రాలు కూడా ఈవారమే వస్తున్నాయి. సినిమాలకైతే కొదవ లేదు. కానీ వీటిలో ప్రేక్షకుల్ని థియేటర్ల వరకూ రప్పించే సినిమా ఏదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి.