వేసవి సీజన్లోకి టాలీవుడ్ ఎంటర్ అవుతోంది. ఈ సీజన్లో ఎలాగూ పెద్ద సినిమాల హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. ఈలోగా చిన్న సినిమాలు బాక్స్ ఆఫీసుని పలకరించబోతున్నాయి. ఈ వారం అయితే ఏకంగా నాలుగు సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఓ పిట్టకథ, అనుకున్నదొక్కటీ – అయినది ఒక్కటీ, పలాస, కాలేజ్ కుమార్ విడుదల కాబోతున్నాయి.
పలాస సినిమాపై ముందు నుంచీ కాస్త గురి ఉంది. ఈ సినిమాకి ఇప్పటికే చాలా ప్రివ్యూలు పడ్డాయి. సినిమా సెలబ్రెటీలు దాదాపుగా పలాస చూసేశారు. వాళ్లంతా మంచి రివ్యూలు ఇచ్చారు. సినిమా చాలా రియలిస్టిక్‌గా ఉందని, ఇప్పటి సమాజాన్ని ప్రతిబింబించిందని కితాబులు ఇచ్చారు. ప్రచార చిత్రాలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. పబ్లిసిటీ పరంగా కాస్త ముందున్న చిత్రం..’ఓ పిట్టకథ’. ఈ సినిమాలో నటించినవాళ్లంతా దాదాపుగా కొత్తవాళ్లే. అయితే.. స్టార్ దర్శకుల్ని, హీరోల్ని రంగంలోకి దింపి పబ్లిసిటీతో హైప్ క్రియేట్ చేసింది చిత్రబృందం.
అడల్ట్ కంటెంట్ సినిమాలకు ఈమధ్య కొరత లేకుండా పోయింది. ప్రతీవారం ఇలాంటి సినిమా ఒకటి వస్తూనే ఉంది. ఈ జాబితాలో చేరే చిత్రం ‘అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ’. నలుగురు అమ్మాయిల కథ ఇది. అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తారు? వాళ్ల కోరికల్ని ఎలా అదుపులో ఉంచుకుంటారు? అనే పాయింట్ పట్టుకుని.. దానికో మర్డర్ మిస్టరీ జోడించి ఓ మసాలా సినిమాగా రూపొందించారు. యూత్‌ని టార్గెట్ చేసిన ఈ సినిమా… ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. వీటితో పాటు కాలేజ్ కుమార్ అనే మరో చిన్న సినిమా వస్తోంది. దానికి అటు పబ్లిసిటీ లేదు, హైపూ లేదు. మరి ఈ నాలుగు చిత్రాల్లో బాక్స్ ఆఫీసుని షేక్ చేస్తుందో చూడాలి.