మార్చి ‘కోర్ట్’ రూపంలో ఓ మంచి విజయాన్ని అందించింది. మరో హిట్ పడితే ఈనెలని హ్యాపీగా సాగనంపేయొచ్చు. ఆఖరి వారంలో 5 సినిమాలు వస్తుండడం, ఐదూ విభిన్న కథాంశాలు కావడంతో… వాటిలో ఏదో ఒకటి కచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది. రాబిన్‌వుడ్, మ్యాడ్, లూసీఫర్ 2, వీర ధీర శూర ఈ వారం ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. మొదటి రెండూ స్ట్రయిట్ చిత్రాలైతే. మిగిలినవి డబ్బింగ్ బొమ్మలు.
నితిన్ ‘రాబిన్‌వుడ్’గా మారిపోయాడు. శ్రీలీల కథానాయిక. డేవిడ్ వార్నర్ అతిథి పాత్ర చేయడం, ‘అదిదా సర్ప్రైజ్’ పాట హిట్ అవ్వడంతో… ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజర్, ట్రైలర్ సరదాగా అనిపించాయి. కామెడీ చిత్రాలకు ఇప్పుడు మంచి గిరాకీ వుంది. అన్నీ కలిసొస్తే… నితిన్ తన వరుస ఫ్లాపులకు చెక్ పెట్టే ఛాన్సుంది.
‘మ్యాడ్ 2’ కూడా ఈనెల 28న విడుదల కావడానికి సిద్ధమైంది. మ్యాడ్ సూపర్ హిట్ అవ్వడం.. కలిసొచ్చే అంశం. కాలేజీ కుర్రాళ్లకు ఈ సినిమా మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది. సితార నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టుకొంటున్నాయి. పైగా ఇది సీక్వెల్. పాటలు హిట్టయ్యాయి. ‘రాబిన్ వుడ్`కి ఈ సినిమా గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. 27న ప్రీమియర్ షోలు వేసే అవకాశం ఉంది. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నార్మల్ బుకింగ్స్ మాత్రం ఓపెన్ అయిపోయాయి.
మోహన్ లాల్ ‘లూసీఫర్ 2’ ఈవారమే వస్తోంది. ఈనెల 27న రిలీజ్ అవుతోంది. మోహన్ లాల్ హిట్ చిత్రాల్లో ‘లూసీఫర్’ ఒకటి. తెలుగులో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేశారు. ‘లూసీఫర్ 2’ చాలా గ్రాండ్‌గా కనిపిస్తోంది. ఫృథ్వీరాజ్ సుకుమార్ దర్శకుడు. మోహన్ లాల్ తో తీసిన రెండు సినిమాలూ హిట్ అయ్యాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు రూ.150 కోట్లతో రూపొందించిన సినిమా ఇది. తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. కాబట్టి థియేటర్ల విషయంలో పెద్దగా బెంగ పడాల్సిన అవసరం లేదు.
విక్రమ్ సినిమా ‘వీర ధీర శూర’ కూడా ఈవారమే వస్తోంది. మిగిలిన 3 సినిమాలతో పోలిస్తే బజ్ తక్కువ వుంది. కాకపోతే… ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. సూర్య పాత్ర క్లిక్ అయితే సినిమా హిట్టే అనే సెంటిమెంట్ ఒకటుంది. దాన్ని విక్రమ్ నమ్ముతున్నాడు. ట్రైలర్ చూస్తే ఇదో డిఫరెంట్ సినిమా అనిపిస్తోంది. విక్రమ్ హిట్ కొట్టి చాలా ఏళ్లయ్యింది. ‘తంగలాన్’కు మంచి అప్లాజ్ వచ్చినా తెలుగులో వసూళ్లు దక్కలేదు. ఈసారి ఆయన హిట్ కొట్టక తప్పని పరిస్థితి.
వీటితో పాటుగా హిందీ సినిమా ‘సికిందర్’ కూడా ఈనెలాఖరులో విడుదల అవుతోంది. సల్మాన్ – రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. బీసీల్లో కాకపోయినా ఏ సెంటర్లలో సల్మాన్ సినిమా ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది.
మొత్తానికి 5 సినిమాలతో ఈవారం ప్రేక్షకుల వినోదానికి అయితే ఢోకా లేదు. వీకెండ్‌తో పాటు రంజాన్ సెలవలు కూడా కలిసొస్తాయి.