గత కొన్ని వారాలుగా టాలీవుడ్ స్థబ్దుగా ఉంది. ఎక్కడా ఎలాంటి హడావుడి లేదు. హిట్టు మాట అసలే లేదు. సినిమాలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి. కానీ మెరుపుల్లేవు. కనీసం థియేటర్‌కి వెళ్లి చూడాలన్న ఆసక్తిని ఒక్క సినిమా కూడా కలిగించడం లేదు. గత వారం అయితే… మరీ డల్ గా సాగిపోయింది. సీజన్ అలాంటిది. మార్చిలో పరీక్షల హడావుడి ఉంటుంది. అందుకే సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలకు ధైర్యం సరిపోదు. దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ వస్తున్నాయి. ఈవారం అయితే రెండు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఒకటి… అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన `ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి` అయితే మరోటి ఉపేంద్ర సినిమా `కబ్జ`.
ఒకటి అచ్చమైన తెలుగు సినిమా అయితే, మరోటి డబ్బింగ్ బొమ్మ. కాకపోతే…చూడాలన్న ఆసక్తి మాత్రం రెండింటి మీదా ఉంది. ఎందుకంటే అవసరాల సినిమాలన్నీ క్లాస్ టచ్‌లో ఉంటాయి. హృదయాన్ని మెలిపెడతాయి. అలాంటి కంటెంట్ ఈ సినిమాలో ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దానికి తోడు నాగశౌర్య, మాళవికల జంట, పాటలు ఇవన్నీ ఆకర్షిస్తున్నాయి. కబ్జ అయితే పూర్తి మాస్, కమర్షియల్ సినిమా. ఉపేంద్ర సినిమాలంటే తెలుగువారికి ఆసక్తి ఉంది. పైగా.. కేజీఎఫ్ మార్క్ ట్రైలర్‌తో.. కాస్త టెమ్ట్ చేస్తోంది ఈ సినిమా. ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే, బాక్సాఫీసుకి మాత్రం కాస్త కదలిక తెచ్చే శక్తి వీటికి ఉందనిపిస్తోంది. చూద్దాం.. ఏమవుతుందో?