‘ఓవర్ ది బోర్డ్’ అనే మాట తరచూ వింటుంటాం. సాధారణం కంటే.. ఇంకొంత కొసరు ఉండడమే ఓవర్ ది బోర్డ్. ఈమధ్య సినిమా వాళ్లకు ఓవర్ ది బోర్డ్ చాలా సాధారణం అయిపోయింది. ముఖ్యంగా యాక్షన్, హీరోయిజం లాంటి అంశాల్లో. సాధారణ విషయాలు బొత్తిగా ఆనడం లేదు. కాస్త ఎగస్ట్రా ఉండాల్సిందే. హీరో ఒక్కడే పదిమందిని కొట్టడంలో కిక్ రావడం లేదిప్పుడు. ఒక్కడే వందలాదిమందిని తుక్కుతుక్కు చేయాలి. లేదంటే కళ్లకు సరిపోవడం లేదు. ‘యానిమల్’లో హీరో ఒక్కడే ఓ సైన్యాన్ని తుదముట్టిస్తాడు. ‘కిల్’లో కూడా అంతే. ఒక్కడే అడ్డొచ్చినవాళ్లందరినీ నరుక్కుంటూ పోతాడు. కొంతమంది ‘హింసని మరీ ఈస్థాయిలో చూపించాలా’ అని నొసలు చిట్లించారు. యాక్షన్ ప్రియులు మాత్రం ‘ఈమాత్రం కావాల్సిందే’ అని మురిసిపోయారు. అలాంటి వాళ్లకు సైతం ఒళ్లంతా చమటలు పట్టించే సినిమా వస్తే.. అదే.. ‘మార్కో’. డిసెంబరు 20న కేరళలో విడుదలైన ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అక్కడ పెద్ద హిట్. ఇప్పుడు పది రోజులు ఆలస్యంగా తెలుగులో తీసుకొచ్చారు. మరి కేరళ వాసులకు నచ్చిన ‘మార్కో’ తెలుగు వాళ్లకు నచ్చుతుందా? ‘యానిమల్’, ‘కిల్’ని మించిన హింస ఈ సినిమాలో ఏముంది?
జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ డీలర్. ఈ వ్యాపారంలో తనని మించివాళ్లు లేరు. ఓ గ్యాంగ్ తో కలిసి సిండికేట్‌గా పని చేస్తుంటాడు. జార్జ్ కొడుకు విక్టర్ (ఇషాన్ షౌకాత్). తనకు కళ్లుండవు. విక్టర్ స్నేహితుడ్ని ఓ ముఠా చంపేస్తుంది. దానికి విక్టర్ సాక్షి. అందుకే విక్టర్ ని కూడా దారుణంగా చంపేస్తారు. ఈ హత్య ఎవరు చేశారో జార్జ్ తెలుసుకోవాలనుకొంటాడు. జార్జ్ నమ్మిన బంటు మార్కో (ఉన్నిముకుందన్). జార్జ్ కుటుంబాన్ని తన కుటుంబంలా భావిస్తాడు. ముఖ్యంగా విక్టర్ అంటే తనకు ప్రాణం. విక్టర్ మరణానికి కారణమైన వాళ్లందరినీ క్రూరంగా చంపుతానని చర్చ్‌లోనే ప్రమాణం చేస్తాడు. మరి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకొన్నాడా? విక్టర్ ని చంపినవాళ్లెవరు? ఎందుకోసం చంపారు? అనేది మిగిలిన కథ.
ఇదో రివైంజ్ డ్రామా. తన సోదర సమానుడైనవాడ్ని చంపినవాడిపై హీరో తీర్చుకొనే ప్రతీకారం. ఇలాంటి కథలు చాలా విన్నాం. చూశాం. కానీ ‘మార్కో’ ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా మలచడం. హత్యకు కారణం ఎవరో, ఎందుకోసం చంపారో.. ముందే తెలిసిపోతుంది. కాబట్టి ఇందులో సస్పెన్స్ ఎలిమెంట్ ఏమీ ఉండదు. హత్య చేసిందెవరో హీరో తెలుసుకోవడం, వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడమే కాన్సెప్ట్. ప్రతీ ఫైట్.. ప్రేక్షకుల్ని రక్తంలో ముంచి బయటకు తీసినట్టే ఉంటుంది. ‘ఇంతకంటే రక్తపాతం ఇక చూడలేమేమో’ అనే ఫీలింగ్ ప్రతీ యాక్షన్ ఎపిసోడ్ లోనూ కనిపిస్తుంది. కానీ అంతకు మించిన హింస, రక్తం.. తెరపైకి వస్తూనే ఉంటాయి. కొన్ని ఎపిసోడ్లు ఆసక్తికరంగా స్టైలీష్‌గా తీశాడు. కానీ చాలా చోట్ల రక్తం ఏరులై పారుతుంది. కొన్ని షాట్స్.. సున్నితమనస్కులు అస్సలు తట్టుకోలేరు. హింస అంత మితిమీరింది. చేతులు తెగిపడడం, తలలు ఎగిరిపడడం.. చాలా కామన్‌గా కనిపించే దృశ్యాలు. ఇంట్రవెల్ ఫైట్.. ‘పుష్ప 2’ క్లైమాక్స్ ఫైట్‌ని గుర్తుకు తెస్తుంది.
చంపడంలో ఎన్ని రకాలు ఉంటాయో చెప్పడానికి ఈ సినిమాని ఓ గైడ్‌లా వాడుకోవొచ్చు. ఒక చావుకీ మరో చావుకీ.. రక్తపాతంలో చాలా తేడా ఉంటుంది. యాసిడ్‌లో ముంచి చంపడం, మాట్లాడుతూ మాట్లాడుతూ గుండె కాయ కోసేయడం, కలప చెక్కే మిషన్ తో కాళ్లూ, చేతులూ నరుక్కుంటూ పోవడం, గర్భిణీ స్త్రీ నోట్లో ఆయుధాన్ని దింపడం.. ఓహ్… రాస్తుంటేనే చేతులకు రక్తపు మరకలు అంటిన ఫీలింగ్ కలుగుతుంది. ఓదశలో.. ‘అసలు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందెవడ్రా’ అని బిగ్గరగా అరవాలనిపిస్తుంది. ఈ సినిమా చూశాక.. ‘కిల్’ కె.విశ్వనాధ్ సినిమాలా పవిత్రంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలూ, గర్భిణీ స్త్రీలూ, గుండె జబ్బు ఉన్నవాళ్లూ ఈ సినిమాని ఎవాయిడ్ చేయడమే బెటర్. ‘మాకు యాక్షన్ ఉంటే చాలు. ఇంకేం అక్కర్లెద్దు’ అనుకొనేవాళ్లకు ఇంతకు మించిన యాక్షన్ సినిమా చూపించడం కష్టం.
ఉన్నిముకుందన్ తెలుగులో కొన్ని సినిమాలు చేశాడు. ‘యశోద’, ‘జనతా గ్యారేజ్’ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. తనని ఈ రేంజ్ యాక్షన్ మూవీలో, అందులోనూ హీరోగా చూడడం తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. తన వరకూ చాలా కష్టపడ్డాడు. నిజంగా తను కొడుతుంటే.. నమ్మాలనిపిస్తుంది. శరీరాకృతి ఆ స్థాయిలో మార్చుకొన్నాడు. యశ్ లాంటి యాక్షన్ హీరోకి ఈ కథ పడి ఉంటే మరోలా ఉండేది. సిద్దిఖీ పాత్ర కూడా చాలా బాగా తీర్చిదిద్దారు. ప్రీ క్లైమాక్స్‌లో సిద్దిఖీనే ఓ హీరోలా కనిపిస్తాడు. ఓ స్టైలీష్ విలన్ గ్యాంగ్ ని వెదికి పట్టుకొన్నాడు దర్శకుడు. వాళ్ల పాత్రలు, ప్రవర్తన భయంకరంగానే ఉన్నాయి.
ఈ సినిమా కోసం పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లకు మంచి భవిష్యత్తు ఉంది. ‘కిల్‌ని’ మించిపోయేలా వాటిని డిజైన్ చేశారు. ఓ ఫైట్ అయితే పబ్ జీ చూసినట్టు ఉంటుంది. సింగిల్ షాట్ లో చాలా పెద్ద ఫైట్ ని కంపోజ్ చేశారు. కెమెరా, లైటింగ్ సెటప్ బ్రహ్మాండంగా కుదిరాయి. ఓ యాక్షన్ సినిమాని ఏ రేంజ్లో తీయాలో అదే రేంజ్లో తీశారు. ఎమోషన్ని పక్కన పెట్టి, కేవలం యాక్షన్ కోసమే ఎదురు చూసేవాళ్లకు ‘మార్కో’ పెద్ద ట్రీట్. రక్తపాతం అంటే భయపడేవాళ్లు ధియేటర్ దరిదాపుల్లో కూడా వెళ్లకండి. ఇది మేం చేస్తున్న చట్టబద్ధమైన హెచ్చరిక.