ప్రపంచంలో క్రీడాకారులలోకెల్లా అత్యధిక పారితోషికం అందుకొంటున్న ప్రముఖ రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవ డ్రగ్ పరీక్షలో పట్టుబడ్డారు. కనుక ఈనెల 12వ తేదీ నుండి మొదలయ్యే ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆమెను ఆడకుండా నిషేధం విధించినట్లు అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ నిన్న ప్రకటించింది. ఆమె మెగ్నీషియం లోపాన్ని సరిచేసుకొనేందుకు, డయాబిటిస్ వ్యాధిని అదుపులో ఉంచుకొనేందుకు గత పది సంవత్సరాలుగా ‘మెల్డోనియం’ అనే నిషేధిత పదార్ధాన్ని కలిగిన మందులను వాడుతున్నారు. ఈ నెలలో ఇంతవరకు ఆమెతో కలిపి మొత్తం ఏడుగురు క్రీడాకారులపై ఈ నిషేధిత ‘మెల్డోనియం’ కలిగి ఉన్నందుకు బహిష్కరణ వేటు పడింది.
తన అభిమానులను నొప్పించినందుకు క్షమించమని షరపోవ కోరారు. “నేను చాలా పెద్ద తప్పు చేసాను. నేను నా అభిమానులను, ఈ క్రీడను కూడా అవమానించినట్లు భావిస్తున్నాను. ఈ కారణంగా నేను తదనంతర పరిణామాలని ఎదుర్కోవలసి ఉంటుందని నాకు తెలుసు. కా క్రీడా జీవితం ఈవిధంగా ముగించాలని నేను కోరుకోవడం లేదు. కనుక నాకు మరొక్క అవకాశం కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను,” అని ఆమె లాస్ ఎంజల్స్ మీడియాతో అన్నారు. మారియా షరపోవ (28) ఇంత వరకు ఐదుసార్లు గ్రాండ్ సలాం టైటిల్స్ గెలుచుకొన్నారు.
సాధారణంగా డ్రగ్స్ పరీక్షలో పట్టుబడిన వారిపై 4సం.లు నిషేధం విధిస్తారు. కానీ కొన్ని కేసులలో ఆ క్రీడాకారులు ఉద్దేశ్యపూర్వకంగా నిషేదిత డ్రగ్స్ వాడలేదని అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ నమ్మినట్లయితే మొట్టమొదటిసారి క్షమిస్తుంది లేదా వారి శిక్షా కాలాన్ని తగ్గించబడుతుంది. మరి మారియ షరపోవ విషయంలో అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ ఏవిధమయిన నిర్ణయం తీసుకొంటుందో చూడాలి.