Mark Antony Movie Telugu Review
రేటింగ్: 2/5
టైమ్ ట్రావెలింగ్ కథల్లో ది బెస్ట్… ఆదిత్య 369. అప్పట్లో ఇన్ని గ్రాఫిక్స్ జిమ్మిక్కుల్లేవు. స్క్రీన్ ప్లే టెక్నిక్కులు లేవు. సైన్స్ పై పెద్దగా ఎవరికీ అవగాహనా లేదు. కానీ తెరపై ఓ అబద్దాన్ని నిజంగా నిజమని నమ్మించేశారు సింగీతం. ఇప్పుడొచ్చే టైమ్ ట్రావెలింగ్ కథలకూ.. ఆదిత్యనే స్ఫూర్తి. 24 సినిమాలో విక్రమ్ కొంతవరకూ మెస్మరైజ్ చేయగలిగాడు. కానీ… ఎక్కడో… చిన్న వెలితి. ఇప్పుడు `మార్క్ ఆంటోనీ` వచ్చాడు. తను కూడా టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్టునే నమ్ముకొన్నాడు. మరి ఈసారి ఈ మ్యాజిక్ ఫలించిందా, లేదా? అసలింతకీ విశాల్ చెప్పిన టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్టులో కొత్తదనం ఏముంది..?
ఆంటోనీ (విశాల్), జాకీ (ఎస్.జె.సూర్య) ఇద్దరూ ప్రాణ స్నేహితులు.. డాన్లూ. ఆంటోనీని ఏకాంబరం (సునీల్) చంపేసి, పారిపోతాడు. అప్పటి నుంచీ ఏకాంబరం కోసం జాకీ అన్వేషిస్తుంటాడు. ఆంటోనీ కొడుకు మార్క్ (విశాల్). తనకి తండ్రంటే ద్వేషం. తన తల్లిని తండ్రే చంపాడన్నది తన కోపం. ఓ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. జాకీ కొడుకు మదన్ (ఎస్.జె.సూర్య). మార్క్, మదన్ మంచి స్నేహితులు. ఓసారి మార్క్‌కి అనుకోకుండా ఓ ఫొన్ దొరుకుతుంది. అది… మామూలు ఫోన్ కాదు. టైమ్ ట్రావెలింగ్ చేయగలిగే ఫోన్. ఆ ఫోన్ ద్వారా గతంలోకి వెళ్లి.. తన తల్లిని రక్షించుకోవాలనుకొంటాడు. ఆ ప్రయత్నంలో మార్క్ కి కొన్ని నిజాలు తెలుస్తాయి. అవేంటి? ఆ నిజాలు తెలుసుకొన్న మార్క్ ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.
కథ రెండు మూడు లైన్లలో చెప్పుకోవడానికి సింపుల్ గా ఉన్నా – తెరపై చూస్తున్నప్పుడు మాత్రం గందరగోళంగా కనిపిస్తుంటుంది. దానికి కారణం.. దర్శకుడి స్క్రీన్ ప్లే. టైమ్ ట్రావెలింగ్ కథ ఇది. ఓ మనిషి ఫోన్ సహాయంతో గతంలోని వ్యక్తులతో మాట్లాడడమే లాజిక్ లెస్. దాన్ని మరింత క్లూ లెస్ గా తీసి, ప్రేక్షకుల్ని అడుగడుగునా గందరగోళానికి గురి చేశాడు దర్శకుడు. ఈ టైమ్ ట్రావెలింగ్ ఫోనేంటి? అది ఎలా పని చేస్తుంది? ఎప్పుడు పని చేస్తుంది? పని చేసినప్పుడు చుట్టు పక్కల వాతావరణం ఎలా ఉంటుంది? ఇవన్నీ.. సాయి కుమార్ ఓవర్ ఓవర్లో ఓ సైన్స్ పాఠంలా చెప్పుకొంటూ వెళ్లాడు దర్శకుడు. ఈ వాయిస్ ఓవర్ దాదాపు 5 నిమిషాలు సాగుతుంది. ఆ 5 నిమిషాలూ బుర్ర పెట్టి వినకపోతే.. ఆ తరవాత జరుగుతున్న వ్యవహారాలన్నీ గందరగోళంగా అనిపిస్తాయి. ఫ్లాష్ బ్యాక్ అయిపోయాక.. అసలు కథ మొదలవుతుంది. ఆ ఫోన్ మార్క్ చేతికి చిక్కడం, తను గతంలోకి వెళ్లి, అమ్మతో మాట్లాడాలనుకోవడం ఇవన్నీ ఆసక్తిగానే అనిపిస్తాయి. కానీ పదే పదే అవే సీన్లు తెరపైకి రావడం, ఒకే ఎమోషన్ చుట్టూ సినిమా తిప్పడం వల్ల.. ఆ ఆసక్తి క్షీణోపాంత ప్రయోజన సూత్రంలా మెల్లమెల్లగా తగ్గుతూ వెళ్తుంది.
కొన్నిసార్లు `మానాడు` ఎఫెక్ట్ ఈ సినిమాపై కనిపిస్తుంటుంది. పైగా మానాడులో కనిపించిన సూర్యనే ఇక్కడా ఉండడంతో… ఆ సినిమానే కాపీ కొట్టి ఇంకోలా తీశారా అనే డౌటు కూడా వేస్తుంటుంది. టైమ్ ట్రావెల్ లాంటి కథల్లో లాజిక్కులు వెదకడం అనవసరం. కానీ.. మరీ దర్శకుడు సన్నివేశాల్ని తన చిత్తం వచ్చినట్టు రాసుకొన్న విధానాన్నే హర్షించలేం. చనిపోయిన మనుషులు మళ్లీ బతికి రావడం, ఫ్లాష్ బ్యాక్‌లో కాలిస్తే… ప్రెజెంట్ లో వేళ్లు తెగిపోవడం.. ఇవన్నీ గందరగోళంగా అనిపిస్తాయి. ఎంత లాజిక్ లు లేకపోయినా, మరీ ఇలా తీయాలా? అనిపిస్తుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా కొత్తగా ఏం అనిపించదు. ఇటీవల వచ్చిన `కింగ్ ఆఫ్ కోతా`లో.. ఇంట్రవెల్ పాయింట్ కూడా దాదాపుగా ఇదే.
ద్వితీయార్థంలో తండ్రీ కొడుకులైన సూర్యల మధ్య నడిపిన ట్రాక్ కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఫోన్ కాల్ ద్వారా సూర్య తన తండ్రిని కాపాడాలనుకోవడం, అది ఫెయిల్ అవ్వడం.. ఈ సీన్లు రక్తి కట్టాయి. కాకపోతే అక్కడ కూడా సూర్య ఎప్పటిలా ప్రతీ డైలాగ్ అరిచి మరీ చెప్పుకొంటూ వెళ్లడంతో… ఓ దశలో మరీ రోతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో కూడా ఈ గందరగోళం కొనసాగుతుంది. అక్కడ విశాల్ గుండు తో కనిపించడం, వెరైటీ బాడీ లాంగ్వేజ్‌తో ఫైట్ చేయడం కాస్త రిలీఫ్. అయితే `అనకొండ` అంటూ పెద్ద మిషన్ గన్ తీసుకొచ్చి ఆడుకోవడం మాత్రం… కేజీఎఫ్, ఖైదీ లాంటి చిత్రాలకు స్పూఫ్‌లా అనిపిస్తుంది. చివర్లో.. సీక్వెల్ ఉంది అంటూ ఓ బీజం వేశారు.
విశాల్ రెండు మూడు రకాల గెటప్పులు వేయడానికి ఈ సినిమా ఉపయోగపడింది. అయితే ఏ గెటప్పులోనూ.. తను ఆకట్టుకోడు. చివర్లో గుండు గెటప్ తప్ప. ఆంటోనీ పాత్ర కోసం గొంతు మార్చి డబ్బింగ్ చెప్పాడు విశాల్. ఆ ప్రయత్నం కూడా బెడసి కొట్టింది. సూర్య ఎప్పటిలానే ఓవర్ ది బోర్డ్ నటనతో, అరవ అతితో విసిగించే ప్రయత్నం చేశాడు. జాకీగా తన గెటప్ మాత్రం బాగుంది. రీతూ వర్మ ఈ సినిమాలో ఎందుకు ఉందో అర్థం కాదు. తనతో తొలిసారి మాస్ స్టెప్పులు వేయించారు. మిగిలిన నటీనటుల్లో ఎవరికీ పెద్ద పాత్రలు దక్కలేదు.
జీవీ ప్రకాష్ సంగీతం అదోలా ఉంది. రెట్రో స్టైల్ ని తీసుకొద్దామనుకొన్నాడు కానీ కుదర్లేదు. అయితే ఆ కాలానికి తగ్గట్టుగా కలర్ ఇచ్చారు ఫొటోగ్రఫీతో. పాట, ఫైటూ మిక్స్ చేసిన సీన్… `కాంచన`ని గుర్తుకు తెస్తుంది. ఆ బీటు కూడా అలానే ఉంది. ఓ గ్యాంగ్ స్టర్ కథలో, టైమ్ ట్రావెల్‌ని మిక్స్ చేయడం మంచి ఆలోచనే. అయితే.. ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడంలో దర్శకుడు గందరగోళానికి గురయ్యాడు. అక్కడక్కడ కొన్ని ఫన్నీ మూమెంట్స్ మినహాయిస్తే… మార్క్ ఆంటోనీ ఏ విషయంలోనూ పెద్దగా మార్కులు వేయించుకోలేదు.
రేటింగ్: 2/5