హైదరాబాద్: ఫేస్బుక్ డైరెక్టర్లలో ఒకరైన మార్క్ ఆండ్రీసెన్ భారత్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ సంజాయిషీ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు తనను కూడా బాగా బాధించాయని, ఆ వ్యాఖ్యలు, తమ కంపెనీ ఆలోచనా ధోరణిని ప్రతిబింబించబోవంటూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశారు. ఇండియా తనకు, ఫేస్బుక్ కంపెనీకి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. గతంలో తాను భారత్‌లో పర్యటించానని, అక్కడి ప్రజల మానవత్వాన్ని, స్ఫూర్తిని, విలువను చూసి స్ఫూర్తి పొందానని రాశారు. ప్రజలందరూ తమ అనుభవాలను పంచుకుంటే ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుందన్న తన ఆలోచనను భారత పర్యటన మరింత పటిష్ఠం చేసిందని పేర్కొన్నారు.
ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ పథకాన్ని ట్రాయ్ కొట్టిపారేసిందన్న ఆక్రోశంతో, ఆ ఆదేశాలపై స్పందిస్తూ బ్రిటిష్ పాలనలోనే భారత్ బాగుందంటూ మార్క్ ఆండ్రీసెన్ ట్విట్టర్లో కామెంట్ చేశారు. దీనిపై భారత్ నుంచి ఒక్కసారి నిరసనలు వెల్లువెత్తటంతో అతను దానికి వివరణ ఇచ్చాడు. తాను వలస పాలనకు వ్యతిరేకమేనని, భారత్‌తో సహా ఏ దేశానికైనా స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఉండాలనే కోరుకుంటానని ట్వీట్ చేశారు.