ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మరియు ఆ సంస్థ సి.ఈ.ఓ. మార్క్ జుకేర్ బెర్గ్ డిల్లీ వచ్చేరు. ఆ సందర్భంగా డిల్లీలో ఐ.ఐ.టి. విద్యార్ధులతో మాట్లాడుతూ “ప్రపంచంలో ఫేస్ బుక్ వాడుతున్నవారిలో భారత్ రెండవ స్థానంలో ఉంది. కానీ ఇప్పటికీ భారత్ లో చాలా మందికి ఇంటర్నెట్ సౌకర్యం లేదని తెలుసుకొని చాలా ఆశ్చర్యపడుతున్నాను. ప్రపంచంలో అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని మేము ప్రయత్నిస్తున్నాము. కనుక భారత్ లో కూడా ప్రతీ ఒక్కరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో తెచ్చేందుకు మావంతు సహాయసహకారాలు భారత ప్రభుత్వానికి అందించడానికి మేము సిద్దంగా ఉన్నాము. భారత్ లేకుండా ఇంటర్నెట్ తో ఈ ప్రపంచాన్ని అనుసంధానించలేమని భావిస్తున్నాను. భారత్ లో విస్త్రుతమయిన వ్యాపారావకాశాలున్నాయి. వాటిని వినియోగించుకొంటూ భారత్ లో ప్రతీ ఒక్కరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో తెచ్చేందుకు మేము కృషి చేస్తాము,” అని మార్క్ జుకేర్ బెర్గ్ అన్నారు.
మార్క్ జుకేర్ బెర్గ్ చెప్పిన ఈ మాటలు నూటికి నూరు శాతం వాస్తవమని చెప్పవచ్చును. ఎందుకంటే ఈరోజుల్లో మొబైల్ ఫోన్, దానిలో ఇంటర్నెట్, ఫేస్ బుక్, ట్వీటర్ లేని యువత లేరనే చెప్పవచ్చును. ఫేస్ బుక్, ట్వీటర్ వంటి సామాజిక వెబ్ సైట్ల ప్రభావం మన దేశంపై ఎంతగా విస్తరించింది అంటే, ఇప్పుడు అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడే రాజకీయ నాయకులు సైతం తప్పనిసరిగా వాటిని ఉపయోగించుకోవడం నేర్చుకోవలసి వస్తోంది. లేకుంటే అది నేర్చుకొన్న తమ ప్రత్యర్ధుల చేతిలో ఓటమి ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ దేశంలో ఇంకా మూడొంతుల మందికి పైగా ఇంటర్నెట్ సౌకర్యం లేదు. అందుకే ప్రభుత్వాలన్నీ ఇప్పుడు ఫ్రీ వైఫీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి.