లాక్ డౌన్ సమయంలో, థియేటర్లు బంద్ అయ్యాయి. అప్పుడు ఓటీటీనే ఆధారమైంది. చాలా సినిమాల్ని ఓటీటీలు లాక్కున్నాయి. మరికొంతమంది నిర్మాతలు ఓటీటీలను ఆశ్రయించాయి. అయితే… దురదృష్టవశాత్తూ.. ఓటీటీ సరైన హిట్స్ చూడలేకపోయింది. `వి`, `నిశ్శబ్దం` లాంటి పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో బోల్తా కొట్టాయి. దాంతో… తెలుగు సినిమాల్ని, అందునా పెద్ద సినిమాల్ని తీసుకోవడానికి ఓటీటీ సంస్థలు కాస్త వెనుకంజ వేశాయి. ఆ తరవాత లాక్ డౌన్ ఎత్తేయడం, థియేటర్లు తెరచుకోవడంతో – ఓటీటీ ప్రాధాన్యం తగ్గింది.
ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ లాంటి పరిస్థితులు వచ్చేశాయి. థియేటర్లు బంద్ అయ్యాయి. ఇప్పట్లో సినిమాల్ని విడుదల చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి ఓటీటీ సంస్థలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయి, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలపై కర్చీఫ్లు వేయడానికి సిద్ధపడ్డాయి. మరీ ముఖ్యంగా ఓటీటీల టార్గెట్ చిన్న సినిమాలూ, మీడియం బడ్జెట్ సినిమాలపై మళ్లింది. `గల్లీ రౌడీ`, `ఎస్.ఆర్. కల్యాణమండపం`, `పాగల్`, `ఆకాశవాణి`, `గుడ్ లక్ సఖీ` లాంటి సినిమాలతో ఓటీటీ సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్. పెద్ద సినిమాల జోలికి.. ఈసారి ఓటీటీలు వెళ్లకపోవొచ్చు. నిర్మాతలూ… అందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే.. పరిస్థితులు చక్కబడతాయన్నది నిర్మాతల నమ్మకం. పైగా ఓటీటీలో విడుదలైన సినిమాలకు అంతగా స్పందన ఉండడం లేదు. హీరోలూ తమ సినిమాల్ని ఓటీటీలకు ఇవ్వడానికి రెడీగా లేరు. కాబట్టి.. ఈసారి ఓటీటీల టార్గెట్ చిన్న, మీడియం సైజు సినిమాలే.