‘కేరింత’ సినిమాతో వెలుగులోకి వచ్చిన నటుడు పార్వతీశం. ఆ తర్వాత తనకు మళ్ళీ చెప్పుకోదగ్గ సినిమా పడలేదు. ఇప్పుడు హీరోగా ‘మార్కెట్ మహాలక్ష్మీ’అనే సినిమా చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అబ్బాయి, కూరగాయాలు అమ్మే అమ్మాయి ప్రేమలో పడితే? తర్వాత ఏం జరిగిందనే కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న ఈ సినిమా ఆహా ఓటీటీలో విడుదలైయింది. ఇంతకీ సినిమా ఎలా వుంది ? ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ ని అలరించిందా?
పార్వతీశం (ఇందులో హీరో పాత్రకి పేరు లేదు) ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తండ్రి (కేదార్ శంకర్) పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. లక్షలు కట్నం తెచ్చే అమ్మాయి కావాలనేది పార్వతీశం తండ్రి ప్రయారిటీ. కానీ పార్వతీశంకి ఎవరూ నచ్చరు. ఓ రోజు కూరగాయాల మార్కెట్లో మహాలక్ష్మీ (ప్రణీకాన్వికా)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. మహాలక్ష్మీ అదే మార్కెట్ లో కూరగాయాలు అమ్ముకునే ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది? మహాలక్ష్మీ పార్వతీశం ప్రేమని అంగీకరించిందా లేదా? అనే మిగతా కథ.
మార్కెట్లో కాయగూరలు అమ్ముకునే అమ్మాయిని సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రేమించడం.. ఈ పాయింట్ చెప్పగానే బావుంది… తర్వాత ఏమింటనే ఆసక్తి కలుగుతుంది. ఈ సినిమా దర్శకుడి దగ్గర కూడా బహుశా ఈ పాయింట్ వరకే ఉందేమో. తర్వాత ఏం చేయాలో తోచక ఇల్లరికం, ఇండిపెండెంట్, కట్నాలు.. ఇలా రకరకాల కోణాల్లో కథని పల్టీకొట్టించారు. అయితే ఇందులో ఏది కూడా ఆకట్టుకునేలా వుండదు. తొలిసగం అంతా హీరో మార్కెట్ చుట్టూ తిగుగుతూ మహాలక్ష్మీ వెంటపడే సీన్లు… పరమ రొటీన్. అసలు ఈ కథకు అవసరం లేకుండా బొమ్మరిల్లు ట్రాక్ ని బలవంతంగా వాడేసిన వైనం చిరాకు తెప్పిస్తుంది.
అప్పటివరకూ జరిగిన కథంతా ఒట్టి టైం పాస్. అసలు పాయింట్ ‘ఇల్లరికం’ అన్నట్టుగా చివరి 15 నిమిషాల్లో ఇదే సినిమా అసలు కాన్ ఫ్లిక్ట్ అని కొన్ని ఉపన్యాసాలు దంచికొట్టారు. ఎంత చిన్న సినిమా అయినా సినిమా కథకి ఒక గ్రామర్ వుంటుంది. పతాక సన్నివేశాల్లో కాన్ ఫ్లిక్ట్ ని ప్రవేశ పెట్టడం దర్శకుడి అనుభవలేమికి అద్దం పట్టింది. పైగా ఆ కాన్ ఫ్లిక్ట్ లో సన్నివేశ బలం లేదు. కేవలం మాటలతోనే లాగించేసే ప్రయత్నం ఏమంత ఆసక్తిగా అనిపించదు. అయితే ఎలాంటి సభ్యతకు తావులేకుండా క్లీన్ ఫ్యామిలీ సినిమాగా తీయడం చెప్పుకోదగ్గ విషయం.
పార్వతీశం నటన ఓకే గానీ ఎమోషనల్ డైలాగులు చెప్పినప్పుడు అంత సహజంగా కుదరడం లేదు . మార్కెట్ మహాలక్ష్మిగా ప్రణికాన్విక పర్వాలేదనిపించింది. హర్ష వర్ధన్ ది లెక్చర్ ఇచ్చే పాత్ర. ముక్కు అవినాష్, మహబూబ్ బాషా, కేదార్ శంకర్ పరిధిమేర నటించారు.
చిన్న సినిమా ఇది. మ్యూజిక్ కెమరా పనితనం నిర్మాణ విలువలు గురించి పెద్దగా ప్రాస్తవించడానికి ఏమీ లేదు. చాలా సార్లు పాయింట్ బావుందనే అత్యుత్సాహంతో సెట్స్ లోకి వెళ్లిపోయి తర్వాత ఏం చేయాలో తెలీక నీళ్ళు నములుతుంటారు. మార్కెట్ మహాలక్ష్మీ కూడా ఆ కోవకే చేరుతుంది.