బీహార్ ఎన్నికల ఫలితాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముందస్తు హెచ్చరిక లాంటివి…భారత ప్రభుత్వం ప్రతిపక్షాల సహకారాన్నీ సమన్వయాన్నీ సాధించగలిగితే సంస్కరణల అమలు సాధ్యమే… అని జాతీయ, అంతర్జాతీయ ద్రవ్యసంస్ధల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ విశ్లేషణలకంటే బిన్నమైన అభిప్రాయాలూ, సూచనలూ ఆర్ధికాంశాల పత్రికలు, చానళ్ళులో వస్తున్నాయి.
భారత్ విజయగాథకు ప్రస్తుతం ఎలాంటి ఢోకా లేకపోయినా.. ప్రభుత్వం వృద్దిరేటును పెంచుకోవడానికి మాత్రం సంస్కరణలు వేగవంతం చేయాలి. దీనికి ప్రతి పక్షాలతో సంప్రదింపులు జరిపి వాటిని ఆమోదింపజేసుకొవాలని హాంగ్‌కాంగ్ లోని ఒక ఇన్వెస్ట్మెంట్ సంస్ధ సిఇఓ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న మార్కె ట్లతో పోల్చుకుంటే భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది… వృద్దిరేటు ఆకర్షణీయంగా ఏడు శాతం సాధించిం ది… ద్రవ్యోల్బణం బాగా తగ్గించారని .. అయినా వృద్దిరేటు ఆశించి నస్థాయిలో పుంజుకోవడం లేదని అంచనా వేశారు. ప్రభుత్వం అభివృద్దికి పెద్దపీట వేయకుండా మతతత్వ అంశాలను తెరపైకి తేవడం ఆందోళన కలిగించే అంశమని వారు చెబుతున్నారు. మోడీ తర్వాత బీజేపీలో ఆయనకు వారసులు కనిపించడంలేదని, బీజేపీ నాయకులపై నితీశ్ వ్యతిరేక ప్రచారం సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీసిందని కార్పొరేట్లు భావిస్తున్నారు. కొంత మంది మాత్రం ఈ షాక్ తాత్కాలికమేనని చెబుతున్నా.. పార్లమెంటులో కీలక బిల్లులను ఎలాంటి ఆమోదింపజేసుకుంటారని వారు ఆందోళన చెందుతున్నారు.
”బీహార్ ఫలితాలు వచ్చే 24 గంటల్లో ప్రజలు మరచిపోతారు.అయితే సంస్కరణలు చేపట్టకపోతే వృద్దిరేటు అంచనా కంటే తక్కువగా ఉంటుంది. కంపెనీల ఆదాయాలు మందగిస్తాయి. కంపెనీలపై రుణభారం పెరగుతుంది.. మళ్లీ కొత్త పెట్టు బడులకు వెతుక్కోవాల్సి వస్తుంది” అని బ్రిటన్‌కు చెందిన డాల్టన్ క్యాపిటల్ సిఇఒ భట్ చెప్పారు. బీహార్ ఫలితాలు ఇన్టెస్టర్ల సెంటిమెంట్‌పై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ప్రభుత్వం సంస్కరణలు యధాతథంగా కొనసాగిస్తుందని చెప్పారు. ఇన్వెస్టర్లు చాలా తెలివైన వారు… ప్రభుత్వం పనితీరును వారు క్షుణ్ణంగా గమనిస్తారని ఆయన పేర్కొన్నారు. అధిక ప్రాధాన్యం ఇస్తామని.. ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించడానికి గట్టిగా ప్రయత్నిస్తుందన్నారు. జీఎస్టి బిల్లు సహా కీలకమైన బిల్లులకు బీహార్ ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. నితీశ్‌కుమార్ అభివృద్దికి కట్టుబడి ఉంటే బీహార్ రెవెన్యూ పెంచుకోవాలనుకుంటే ఆయన జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపాలన్నారు.
కేంద్రప్రభుత్వం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్టిని అమల్లోకి తేవాలని పట్టుదలతో ఉంది. లోక్‌సభలో ఎన్డీఏకి మెజారిటీ ఉన్నా రాజ్యసభలో మెజారిటీలేక బిల్లుఆమోదం పొందలేకపోతోంది. జీఎస్టి అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్, సేవలపన్ను, ఆక్ట్రాయ్లన్నీ మటుమాయం అవుతాయి. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి వస్తుంది. ఇది పెద్ద అర్ధిక సంస్కరణ.