ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి విలువ గత ఐదేళ్ల కిందట ఎంత ఉందో ఇప్పుడు అంత కూడా లేదు. తిరుపతిలో ఐదేళ్లో కింద ఓ ఇంటిని లేదా స్థలాన్ని రూ. కోటికి బేరం సులువుగా వచ్చేది. ఇప్పుడు అది 60, 70 లక్షలకు కూడా బేరం కావడం కష్టంగా మారింది. ఒక్క తిరుపతిలోనే కాదు అన్ని చోట్లా అదే పరిస్థితి. చివరికి రాజధాని అని హడావుడి చేస్తున్న విశాఖలోనూ అదే పరిస్థితి. అక్కడ టార్గెటెడ్ గా ఓ గ్రూప్ భూములు కొనేసింది .. కృత్రిమంగా పెంచాలని చూసింది కానీ అదీ వర్కవుట్ అవలేదు. ముందు నుంచీ విశాఖలో ఉండే డిమండే ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఆ ఆస్తుల మార్కెట్ వాల్యూ పదే పదే పెంచుతూ పోతోంది. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేస్తోంది.
తాజాగా మరోసారి భూముల విలువను పెంచింది. ఎక్కడెక్కడ ఎంత పెంచారు అనేదానిపై వివరాలు చివరి వరకూ రహస్యంగా ఉంచారు. అయితే చాలా వరకూ 30 నుంచి 70 శాతం వరకూ పెంచినట్లుగా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగోసారి భూముల వాల్యూ పెంచారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని ఇక అందరి ఆస్తుల విలువపెరిగిందని గత ఏడాదే పెంచారు. మళ్లీ ఈ సారి పెంచారు. ఈ భూముల మార్కెట్ వాల్యూ పెంచడం ద్వారా కనీసం పది వేల కోట్లకుపై ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోంది.
భూమి లేదా ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ లెక్కల్లోని మార్కెట్ వాల్యూ ప్రకారం జరుగుతాయి. అంటే ఓ ఎకరం భూమి మార్కెట్ వాల్యూ పాతిక లక్షలు ఉంటే.. అందులో ఏడున్నర శాతం వరకూ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల కింద చెల్లించాలి. అధికారులు తీసుకునే అనధికారిక చార్జీల గురించి పక్కన పెడితే.. ఇప్పుడు మార్కెట్ వాల్యూను ముఫ్పై లక్షలు చేయడం ద్వారా పన్నుపెరిగిపోతుంది.. అదే సమయంలో ఆ భూమి వాల్యూ నిజంగా పెరిగిందంా అంటే అదేమీ ఉండదు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత… ఏ అభివృద్ధి పని.. ప్రాజెక్టుల పనులూ లేకపోవడంతో.. ఆస్తుల విలువ పడిపోయింది. కానీ ప్రభుత్వం మాత్రం పిండుకోవడం ఆపలేదు. ఆస్తుల విలువను పడిపోయేలా చేసి.. వాటిపై నుంచి పన్నులు పిండుకునే రికార్డు ఒక్క ఏపీ ప్రభుత్వానికే ఉందేమో !