రేవంత్ రెడ్డి నెక్ట్స టార్గెట్ బాలకృష్ణ అని ఆయన ఇంటి స్థలాన్నిస్వాధీనం చేసుకునేందుకు మార్కింగ్ చేశారంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రక్రియ కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు నుంచే జరుగుతోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించడంతో పాటు రోడ్డు విస్తరించాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో చర్చలు వరకూ వచ్చాయి. ఎంత భూమి సేకరించాలో లెక్కలు తీశారు.
రేవంత్ ప్రభుత్వం వచ్చాక పనులు మరింత వేగవంతమయ్యాయి. జూబ్లిహిల్స్ చెక్ పోస్టు దగ్గర, కేబీఆర్ పార్క్ వాకింగ్ ట్రాక్ కు అభిముఖంగానే బాలకృ,్ణ ఇల్లు ఉంటుంది. మంచి ప్రైమ్ లోకేష్లోరెండు వైపులా ఉండే ఆ ఇంటికి సంబంధించిన కొంత స్థలం కూడా రోడ్ వైడెనింగ్ లో పోతుంది. ఇంటి వరకూ రాదు. చట్ట ప్రకారం నష్టపరిహారం తీసుకుని ఆ స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ ఎప్పుడో ప్రభుత్వానికి అంగీకారపత్రం కూడా ఇచ్చారని చెబుతారు. ప్రతిగా ఆ స్థలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి కూడా ప్రభుత్వం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలుస్తోంది.
బాలకృష్ణ ఇటీవలి కాలంలో జూబ్లిహిల్స్ లోనే రెండు ఇళ్లు కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం ఉన్న ఇంటి స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి వేరే ఇంటికి మారాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. ఇక్కడ వివాదం ఏమీ లేదు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఏదో సెలబ్రిటీలపై దాడులు చేస్తున్నట్లుగా కలరింగ్ ఇవ్వడానికి ప్రస్తుతం ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.