వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో ఆ పార్టీ నేతలకు అర్తంకావడం లేదు. శైలజానాథ్ ను పార్టీలో చేర్చుకుని ఇంకా బోలెడంత మంది వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలందరి పేర్లు ప్రచారంలోకి తెచ్చారు. చివరికి ఉండవల్లి అరుణ్ కుమార్ పేరు కూడా వైసీపలో చేరబోయేవారి జాబితాలో చేర్చారు. కానీ ఆయన మాత్రం అటు ఖండించలేక.. ఇటు నిజమని చెప్పలేక సైలెంటుగా ఉండిపోయారు. అయితే పార్టీ నుంచి పోయేవారి జాబితా మాత్రం పెరుగుతూనే ఉంది. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పేరును వైసీపీ నేతలు కొట్టేసుకోవాల్సి వస్తోంది.
మర్రి రాజశేఖర్ వైసీపీ సమావేశాల్లో పాల్గొనడం లేదు. ఇటీవల జగన్ నిర్వహించిన గుంటూరు జిల్లా నేతల సమావేశానికి రాలేదు. ఆయనను పిలిచినా రాలేదు. 2019కి ముందు వైసీపీని ఆయనే చూసుకున్నారు. చివరికి విడదల రజనీకి టిక్కెట్ ఇచ్చారు. ప్రతిగా ఎమ్మెల్సీ, మంత్రిని చేస్తానని జగన్ చెప్పారు. అతి కష్టం మీద ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ మంత్రి పదవి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. విడదల రజనీని గుంటూరు పంపించినప్పుడు మర్రి రాజశేఖర్ పేరు పరిశీలనలోకి తీసుకోలేదు. గుంటూరు మేయర్ కు చిలుకలూరిపేట టిక్కెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోగానే అడ్రస్ లేరు.
ఇప్పుడైనా మళ్లీ మర్రి రాజశేఖర్ కు చాన్స్ ఇస్తారనుకుంటే.. మళ్లీ విడదల రజనీకే ఇంచార్జ్ పోస్ట్ ఇచ్చారు. దీంతో మర్రి రాజశేఖర్ ఇక ఆ పార్టీలో ఉండటం దండగ అనుకుంటున్నారు. జగన్ రెడ్డికి తన సామాజికవర్గం అంటే కసి ఉందని..దాని వల్ల తనకు భవిష్యత్ ఎప్పుడూ అవకాశాలు కూడా రావని అర్థం చేసుకున్నారు. కూటమి పార్టీలతో ఆయన జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని అంటున్నారు. త్వరలో ఆయన రాజీనామా ప్రకటన ఉంటుదంని చెబుతున్నారు.