మళ్లీ అదే సీన్..! అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలాగైతే ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపిందో, ఇప్పుడు కూడా అదే తరహా నిరసన వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా తప్పుల తడకలనీ, ఫైనల్ జాబితా రూపొందించకుండా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఏంటనీ, దీన్ని మార్చాలంటూ ఏడాది కిందట న్యాయ పోరాటం కూడా చేశారు. కానీ, పెద్దగా ఫలితం లేకపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విషయంలోనూ టి. కాంగ్రెస్ ది మళ్లీ అవే అభ్యంతరాలు, ఎన్నికల సంఘం పనితీరుపై మళ్లీ తీవ్ర విమర్శలు!
తెలంగాణ ఎన్నికల సంఘం శనివారం నాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున హాజరైనవారిలో సీనియర్ నేత శశిధర్ రెడ్డి ఉన్నారు. రిజర్వేషన్లను ముందే ప్రకటించాలనీ, అభ్యంతరాలన్నీ నివృత్తి అయ్యాకనే షెడ్యూల్ విడుదల చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదరాబాదరాగా ఎన్నికల షెడ్యూల్ ఎందుకనీ, సంక్రాంతి తరువాత విడుదల చేయాలనీ, మార్చిలో ఎన్నికలు పెట్టాలని సూచించారు. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించేశాం మార్పులు కుదరవని నాగిరెడ్డి చెప్పేసరికి… మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి వత్తాసు పలికే విధంగా నాగిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రిజర్వేషన్లను ముందుగా ప్రకటించని ఎన్నికల్ని మొదటిసారిగా చూస్తున్నామనీ, ఇది సరైన విధానం కాదంటూ సమావేశం మధ్యలోనే వాకౌట్ చేశారు. ఈసీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తోందనీ, రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా చర్యలు ఉంటున్నాయని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు.
ఇదే సమావేశంలో పాల్గొన్న తెరాస నేతలు ఈసీని వెనకేసుకొస్తూ…. అధికారులపై మర్రి శశిధర్ రెడ్డి తదితర నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదన్నారు. ఎన్నికల సంఘంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పట్నుంచీ సాకులు వెతికే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇప్పుడు మర్రి శశిధర్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి? అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలానే ఈసీ మీద గట్టిగానే పోరాటం చేశారు. కొన్నాళ్లపాటు కోర్టులకూ వెళ్లారు. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో ఈ వ్యవహారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారా, గతానుభవం ఎలాగూ ఉంది కాబట్టి, ఎందుకు అంత ప్రయాస అనుకుని, కొన్ని రోజులపాటు మీడియా ముందు తెరాసపై తీవ్ర విమర్శలు చేసి మమ అనిపించేసుకుంటారా అనేది చూడాలి.