తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి భాజపాలో చేరబోతున్నారంటూ కథనాలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఈనెల 6న తెలంగాణకు రాబోతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన పార్టీ చేరతారనీ, మూడ్రోజుల కిందటే రామ్ మాధవ్ తో ఆయన కలిశారనీ కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలపై స్పందించారు శశిధర్ రెడ్డి. తాను పార్టీ మారతానంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ఇదంతా భాజపా ఆడుతున్న మైండ్ గేమ్ అన్నారు. ఎవరో నలుగురు నాయకులు భాజపా నేతల్ని కలిశారంటూ లీకులు చేయడం, ప్రముఖ మీడియా ద్వారా ఆ కథనాలకు ప్రజల్లో ప్రచారం కల్పించడం లాంటివి ఆ పార్టీ కుయుక్తులుగా చూడాలని అన్నారు.
భాజపా నుంచి తనకు ఎలాంటి ఆహ్వానమూ రాలేదనీ, ఆ పార్టీవైపు కన్నెత్తి చూసేదే అసంభవం అని శశిధర్ రెడ్డి చెప్పారు. ఆ పార్టీ విధానాలతో తాను ఏకీభవించే పరిస్థితి ఎప్పుడూ ఉండదన్నారు. తన చివరి శ్వాస వరకూ కాంగ్రెస్ లోనే కొనసాగుతాననీ, పార్టీ మారాలనే ఆలోచన గతంలోగానీ, ఇప్పుడుగానీ ఎప్పుడూ తాను చెయ్యలేదని చెప్పుకొచ్చారు. అయితే, తనపేరు భాజపాలో చేరబోతున్న నేతల జాబితాలో ఎందుకు వచ్చిందనే అంశంపై ఆరా తీశాననీ శశిధర్ రెడ్డి చెప్పారు. ఆ మధ్య మెదక్ ఎమ్మెల్యే పి. శశిధర్ రెడ్డి భాజపాలో చేరారనీ, అయితే కొన్ని జాతీయ పత్రికల్లో సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఎమ్. శశిధర్ రెడ్డి భాజపాలో చేరారంటూ కథనాలు రాశాయన్నారు. ఇలా ఎందుకు జరిగిందని తాను కనుక్కుంటే… భాజపా కేంద్ర కార్యాలయమే ఎమ్. శశిధర్ రెడ్డి తమ పార్టీలో చేరిపోయారంటూ విలేకరులకు చెప్పిందని తెలిసిందన్నారు. ఇదంతా భాజపా ఆడుతున్న మైండ్ గేమ్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల సంపూర్ణ విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ సాధిస్తుందన్నారు.
శశిధర్ రెడ్డి లాంటి సీనియర్లు పార్టీలో కొనసాగుతామంటూ ప్రకటించడం టి. కాంగ్రెస్ కి కొంత ఊరటనిచ్చే అంశమే అనాలి. ఎందుకంటే, భాజపాలోకి చాలామంది కాంగ్రెస్ నేతలు జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇప్పటికే కొందరు ప్రముఖ నాయకులు వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు, క్షేత్రస్థాయి కేడర్ కి కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చే నాయకులు కొందరైనా కనిపించాలి. పార్టీ విధానాలకు కట్టుబడేవారు కొందరున్నారు అనే విశ్వాసం కల్పించాలి. అయితే, ఈ ప్రకటనల వల్ల నాయకుల వలసలు ఆగవుగానీ… నిజమైన పార్టీ అభిమానులకు కొంత ఉపశమనం కలిగించేవిగా ఉంటాయి.