‘రాజావారు రాణీవారు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా బాగానే ఆడింది. ఆ వెంటనే ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’తో కమర్షియల్ హిట్ కొట్టాడు. ఆ తరవాత క్రేజీ యువ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఇప్పుడు టాలీవుడ్లో బిజీగా ఉన్న యంగ్ హీరోల్లో తను ఒకడు. కెరీర్లో స్థిరపడిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయాడు. తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరక్తో ప్రేమాయణం నడిపిన కిరణ్.. ఆ తరవాత ఇంట్లో పెద్దల్ని ఒప్పించి నిశ్చితార్థం చేసుకొన్నాడు. ఇప్పుడు పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్సయ్యింది. ఈ విషయాన్ని రహస్య గోరక్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంది.
ఈరోజు కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు. ఈ సందర్భంగా రహస్య గోరక్ సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు… ”మరో 38 రోజుల్లో నిన్ను మై హస్బెండ్ అని పిలిచేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా” అంటూ ఓ కామెంట్ పోస్ట్ చేసింది. దాంతో వీరిద్దరి పెళ్లికి ముహూర్తం ఫిక్సయిపోయినట్టైంది. 2019లో వీరిద్దరి పరిచయమైంది. ఈయేడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకొన్నారు. ‘రాజావారు..’ తరవాత రహస్య సినిమాలకు దూరమైంది. కిరణ్ ప్రస్తుతం ‘క’, ‘దిల్రూబా’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవి కాక మరో రెండు సినిమాలు పైప్లైన్లో ఉన్నాయి.