అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తి చేయడం అనేది దాదాపుగా అసాధ్యంగా తయారైంది. వర్కింగ్ డేస్ పెరిగిపోవడం, కాల్షీట్లు ఎక్కవ అయిపోవడంతో.. బడ్జెట్కూడా తడిసిమోపెడవుతోంది. పేపర్‌పై పేర్చుకున్న అంకెలకీ, చివరికి తేలే లెక్కకూ ఏమాత్రం సంబంధం ఉండడం లేదు. ఇలాంటి వాతావరణంలో ఖర్చు తగ్గించడం అనేది దర్శకుడికి అతి పెద్ద సవాల్. ఈ విషయంలో మారుతికి నూటికి నూరు మార్కులు వేయొచ్చు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `శైలజారెడ్డి అల్లుడు`. ఈసినిమాని మారుతి అనుకున్న బడ్జెట్లో పూర్తి చేయగలిగాడు. మారుతిలో ఓ నిర్మాత కూడా ఉన్నాడు. కాబట్టి వాళ్ల సాధక బాధకాలు మారుతికి తెలుసు. అందుకే.. ప్రతీ పైసా ఆచి తూచి ఖర్చు పెట్టిస్తున్నాడు. శైలజా రెడ్డి అల్లుడులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. రోజుకి దాదాపుగా రూ.6 లక్షల పారితోషికం తీసుకుంటోంది రమ్యకృష్ష. తన పాత్ర కోసం 28 కాల్షీట్లు కావల్సివచ్చిందట. సాధారణంగా 28 రోజుల కాల్షీట్లంటే… 30 నుంచి 35 రోజులకు వెళ్తుంది. కానీ మారుతి రమ్యకృష్ణకు సంబంధించిన సన్నివేశాలన్నీ ప్యాక్డ్గా ప్లాన్ చేసి 22 రోజుల్లోనే పూర్తి చేశాడు. ఆ విధంగా కనీసం నిర్మాతలకు రూ.50 లక్షలు మిగిల్చాడు. ఇలాంటి ప్లానింగే ప్రతీ దర్శకుడికీ ఉంటే… బడ్జెట్లు పరిధులు దాటడం అనేదే ఉండదేమో.