చిన్న సినిమాలతో పైకొచ్చాడు మారుతి. ఇప్పుడు బడా స్టార్స్ తో సినిమాలు తీస్తున్నాడు. అయితే చిన్న సినిమాల్ని మాత్రం మర్చిపోలేదు. వదులుకోలేదు. వీలైనప్పుడు నిర్మాతగా చిన్న సినిమాల్ని తీస్తూనే ఉన్నాడు. తన కథల్ని… మరొకరి చేతిలో పెడుతున్నాడు. దర్శకత్వ పర్యవేక్షణ అంటూ… దగ్గరుండి కొన్ని చిన్న చిత్రాలకు కర్త, కర్మ, క్రియగా వ్యవహారాల్ని నడిపిస్తున్నాడు.
ఇప్పుడు ఓటీటీ కోసం మారుతి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకత్వం మారుతినే అయినా, ఈసారికి మాత్రం `దర్శకత్వ పర్యవేక్షణ` అనే కార్డు మాత్రమే వేసుకుంటున్నాడు. సంతోష్ శోభన్ హీరో. మెహరీన్ హీరోయిన్.యూవీ క్రియేషన్స్ రూపొందిస్తోంది. ఈసినిమాకి `మంచి రోజులు వచ్చాయి` అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గేటెట్ కమ్యునిటీ నేపథ్యంలో, రెండు ఇళ్ల మధ్య సాగే కథ ఇది. ఇందులో కరోనా సమస్యకీ చోటుందట. కరోనాకు ముందు మొదలైన కథ.. కరోనా వెళ్లిపోవడంతో ముగుస్తుందని సమాచారం. ఓ పాజిటీవ్ దృక్పథంతో ఈసినిమాకి ముగింపు పలికారని. అందుకే సింబాలిక్ గా `మంచి రోజులు వచ్చాయి` అనే టైటిల్ ఎంచుకున్నారని తెలుస్తోంది.