మారుతి స్వతహాగా మంచి రచయిత. తన సినిమా కథలన్నీ తనవే. స్క్రీన్ ప్లే, సంభాషణలూ తనవే. ఒక్కడే కూర్చుని రాసుకోవడం అంటే మారుతికి ఇష్టం. పదిమంది రైటర్లని పెట్టుకుని డిస్కర్షన్లు చేయడం, డైలాగులకు వెర్షన్లు రాయించడం తనకు ఇష్టం ఉండదు. తన సినిమాలో వినిపించే ప్రతీ డైలాగూ అచ్చంగా తన సొంతం. ఈ విషయంలో మారుతి త్రివిక్రమ్ నే ఫాలో అయిపోతాడు. ఎందుకంటే.. త్రివిక్రమ్ కూడా అంతే. కథ, స్క్రీన్ ప్లే, డైలాగుల విషయంలో ఎవరి సాయం తీసుకోడు. ఎంత పెద్ద రచయిత అయినా.. నలుగురైదుగురు అసిస్టెంటర్లని పెట్టుకుంటారు. కానీ మారుతి, త్రివిక్రమ్ మాత్రమే ఈ పద్ధతికి దూరం.
అయితే ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు మారుతి. ఈ సినిమా కోసం తొలిసారి రైటర్ల టీమ్ ని పెట్టుకున్నాడు మారుతి. కథ తనదే అయినా సీన్ల విషయంలో ఇంకొందరి సహాయం తీసుకుంటున్నాడు. వాసు వర్మ ఈ టీమ్ లో ఓ సభ్యుడు. వీళ్లతో పాటు మరో ఇద్దరు ముగ్గురు రైటర్లు ఉన్నార్ట. ఇలా… కథ వండడంలో మరొకరి సహాయం తీసుకోవడం మారుతి కెరీల్ లో ఇదే తొలిసారి. కానీ తప్పదు. ఎందుకంటే ఇది ప్రభాస్ సినిమా. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అంతటి స్టార్ ఇప్పుడు మారుతికి అవకాశం ఇవ్వడమే గొప్ప. దాన్ని నిలబెట్టుకోవాలంటే.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే ప్రభాస్ ఛాన్స్ ఇచ్చినా, మారుతి సద్వినియోగం చేసుకోలేదన్న నింద మోయాల్సివస్తుంది. దానికంటే.. ఇలా నలుగుర్ని సాయం కోరడంలో తప్పేం లేదు.