సినిమాల తీత – రాత విషయాల్లో యమ స్పీడుగా ఉంటాడు మారుతి. తను కథ రాయడానికి అట్టే సమయం తీసుకోడు. స్క్రిప్టు కూడా చక చక పూర్తి చేస్తాడు. సినిమా ఎప్పుడు మొదలెడతాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలీదు. అంత ఫాస్టు. ఇప్పుడు కూడా అలానే ఓ సినిమా చేసేస్తున్నాడు. ఓ వైపు… గోపీచంద్ తో `పక్కా కమర్షియల్` సెట్స్‌పైకి తీసుకెళ్లాడు మారుతి. లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగింది. ఈగ్యాప్ లో మారుతి మరో కథ అల్లేసుకున్నాడు. ఓటీటీ కాలం కదా.. అందుకే ఈ సినిమాని ఓటీటీ కోసం తీస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్ ఈమధ్య `ఏక్ మినీ కథ` రూపొందించి, ఓటీటీలో విడుదల చేసింది. ఈ సినిమాతో యూవీకి మంచి లాభాలొచ్చాయి. ఇప్పుడు మరో ప్రాజెక్టుని మారుతి చేతిలో పెట్టింది యూవీ. ఇందులోనూ సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఓ కాలనీలో జరిగే ప్రేమకథ ఇది. రెండు ఇళ్ల మధ్య నడిచే రొమాంటిక్ డ్రామా. కథానాయికగా మెహరీన్ కనిపించబోతోంది. అయితే ఈ సినిమాకి మారుతి కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే. `ప్రేమకథా చిత్రమ్` తరవాత.. మారుతి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సినిమా ఇదే. జులైలో.. `పక్కా కమర్షియల్` షూటింగ్ మొదలవుతుంది. ఈలోగా… ఈ లవ్ స్టోరీని పూర్తి చేయాలని చూస్తున్నాడు మారుతి. ఓ నెలలో… సినిమా పూర్తి చేయడం, అదీ మరో సినిమా చేతిలో ఉండగానే అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో మారుతిని మెచ్చుకోవాల్సిందే.