సినిమాని చాలా ఫాస్ట్ గా తీస్తాడని మారుతికి పేరుంది. పెద్ద ప్యాడింగ్ తో తక్కువ రోజుల్లో సినిమాని పూర్తి చేయగల సామర్థ్యం మారుతి సొంతం. లాక్ డౌన్ సమయంలో చాలా ఫాస్ట్ గా పూర్తి చేసిన సినిమా `మంచి రోజులొచ్చాయి`. అయితే… ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ ఫ్లాపు ప్రభావం మారుతిపై అస్సలు పడలేదు. `పక్కా కమర్షియల్` సెట్స్‌పై ఉండగానే.. ప్రభాస్ తో సినిమా చేసే ఆఫర్ వచ్చింది. ఇప్పుడు చిరంజీవితో సినిమా ఓకే చేయించుకొన్నాడు. అందుకే…`మంచి రోజులొచ్చాయి` రిజల్ట్ పై.. మారుతి ఏమాత్రం బెంగ పెట్టుకోలేదు. `అదో బబుల్ గమ్ లాంటి సినిమా` అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.
“ఓ పెద్ద సూపర్ మార్కెట్‌కి వెళ్తే… అక్కడ అన్ని వస్తువులూ ఉంటాయి. ఆఖరి బబుల్ గమ్‌లు కూడా. ఇంత పెద్ద సూపర్ మార్కెట్ లో బబుల్ గమ్‌లు అమ్మడమేంటి? అంటామా? నేనూ అంతే. నా వరకూ మంచి రోజులు వచ్చాయి ఓ బబుల్ గమ్ లాంటి సినిమా. నేను దాన్ని అమ్మాను. 3 కోట్లతో సినిమా తీసిన సినిమా అది. రూ.12 కోట్ల బిజినెస్ జరిగింది. లాక్ డౌన్ టైమ్ లో 200 మందికి ఉపాధి కల్పించాం. మా వరకూ ఆ సినిమా సక్సెస్ అయినట్టే. రూపాయికి మూడు రూపాయలు జనం ఊరకే ఇవ్వరు. ఆ సినిమాతో మాకు రూపాయికి మూడు రూపాయలు వచ్చాయి“ అని తన ఫ్లాప్ సినిమానీ వెనకేసుకొచ్చాడు మారుతి.