ఈరోజుల్లో, బస్‌స్టాప్ సినిమాలు హిట్టు.. ఆ మాటకొస్తే సూపర్ హిట్టు. ఈ రెండు సినిమాలతో నిర్మాతలు, థియేటర్ యజమానులు బాగా డబ్బులు సంపాదించుకొన్నారు. మారుతికి వరుసగా అవకాశాలొచ్చాయి. అయితే… ఎక్కడో అసంతృప్తి. ఈ రెండింటినీ బూతు సినిమాల జాబితాలో చేర్చేశారు సినీ విశ్లేషకులు. కొత్తజంటలో కాస్త పద్ధతి పాటించినా.. అక్కడక్కడ మసాలా డైలాగులుంటాయి. భలే భలే మగాడివోయ్‌తో పూర్తి స్థాయి క్లీన్ ఎంటర్టైనర్ తీశాడు మారుతి. ఆ సినిమాతో మారుతికి కొత్త ఇమేజ్ వచ్చింది. బాబు బంగారం ఫెయిల్ అయినా… మారుతి గీత దాటలేదు. ఇప్పుడు మహానుభావుడు ఎలా తీశాడన్నది కాస్త ఆసక్తి రేకెత్తించింది. ఈరోజే ఈ సినిమాకి సెన్సార్ అయ్యింది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకి యూబైఏ దొరికేసింది. మారుతి మరోసారి క్లీన్ ఎంటర్టైనర్ తీశాడని అర్థమైపోయింది.
భలే భలే మగాడివోయ్ సినిమా గుర్తుంది కదా? అందులో హీరోకి ఓ బలహీనత ఉంటుంది. దాని చుట్టూ హిలేరియస్ కామెడీ నడిపించాడు. ఇక్కడా అదే దారిలో వెళ్లాడు మారుతి. సినిమా అంతా.. హీరో క్యారెక్టరైజేషన్ మీదే నడిచిందట. అందులోంచే వినోదం, భావోద్వేగాలు పండించాడట మారుతి. ద్వితీయార్థంలో మారుతి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని బాగా నడిపించాడని టాక్. పండక్కి వస్తున్న సినిమా ఇది. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనిపిస్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని.. క్లీన్ ఎంటర్టైనర్గా మలిచాడటని, ఒక విధంగా భలే భలే మగాడివోయ్ ఫార్మెట్‌లోనే ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ దసరాకి ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాల మధ్య పోటీగా వస్తున్న సినిమా కాబట్టి… శర్వా ధైర్యం చేశాడనే చెప్పాలి. కాకపోతే… చిత్రబృందం కంటెంట్‌నే బలంగా నమ్ముకొంది. చూద్దాం.. ఏమవుతుందో..?