ఇండస్ట్రీలో కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి. అందులో మెగా కాంపౌండ్ ఒకటి. మెగా హీరోలతో ఎక్కువగా సినిమాలు చేసే నిర్మాతలు లేదా దర్శకులను మెగా కాంపౌండ్ మనుషులుగా ట్రీట్ చేస్తుంటారు. వీవీ వినాయక్ వంటి కొందరు దర్శకులు కాంపౌండ్స్కి అతీతంగా సినిమాలు చేస్తుంటారు. దర్శకుడు మారుతి అదే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహితుడిగా మారుతి ఇండస్ట్రీలో ఎక్కువమంది జనాలకు తెలుసు. తరవాత దర్శకుడిగా చిన్న సినిమాలతో ప్రయాణం ప్రారంభించారు. ‘కొత్త జంట’తో గీతా ఆర్ట్స్‌లో మారుతి దర్శకుడిగా ఎంటరయ్యారు. రూట్ మార్చి క్లీన్ సినిమా తీశారు. ఆ తరవాత ‘భలే భలే మగాడివోయ్’తో దర్శకుడిగా అతడికి గీతా ఆర్ట్స్ సంస్థే ప్రమోషన్ ఇచ్చింది. అందువల్ల మారుతిపై మెగా కాంపౌండ్ మనిషిగా ముద్ర పడింది. కానీ, మారుతి మాత్రం అందరు హీరోలతో, నిర్మాతలతో సినిమాలు చేయడానికి ప్రత్నిస్తున్నారు.
నాని హీరోగా వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’తో విజయం సాధించడంతో వెంకటేశ్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ మారుతికి వచ్చింది. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. తరవాత శర్వానంద్ హీరోగా ‘మహానుభావుడు’ తీశాడు. అక్కణ్ణుంచి అక్కినేని కాంపౌండ్‌లోకి వచ్చాడు. అక్కినేని నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వం వహించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఈ నెల 13న విడుదల కానుంది. దీని తరవాత గీతా ఆర్ట్స్ యువి క్రియేషన్స్ సంస్థలు నిర్మించే సినిమా ఒకటి చేయనున్నాడు. ఆ తరవాత మహేశ్‌బాబు కాంపౌండ్‌లో మారుతి సినిమా చేసే అవకాశాలు ఎక్కువ వున్నాయి. మహేశ్ సిస్టర్ మంజుల నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయని మారుతి తెలిపాడు. అందులో హీరోగా ఎవరనేది చెప్పలేదు. మహేశ్ బావమరిది సుధీర్‌బాబు నటిస్తారో? లేదా మహేశే నటిస్తారో? వెయిట్ అండ్ సీ!!