మెగా కాంపౌండ్‌తో దర్శకుడు మారుతికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గీతా ఆర్ట్స్‌లో ‘కొత్త జంట’, ‘భలే భలే మగాడివోయ్’ సినిమాల్నీ తీశాడు. అల్లు అర్జున్ కి మారుతి అంటే గురి ఎక్కువ. అందుకే మారుతితో సినిమా చేద్దామని ఎప్పుడో ఫిక్సయ్యాడు. ఇటీవల విడుదలైన.. మహానుభావుడు హిట్ అవ్వడంతో బన్నీతో సినిమా చేసే అవకాశాలు మారుతికి మరింతగా పెరిగాయి. అయితే.. బన్నీకి ఓ మంచి కథ చెప్పి, ఫస్ట్ సిట్టింగ్ లోనే కథని ఓకే చేయించుకోవాలన్నది మారుతి తాపత్రయం. అందుకోసం మారుతి తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నట్టు టాక్. కథల విషయంలో తన దగ్గర ఎక్కువ ఆప్షన్లే ఉన్నా – వినగానే ఓకే చేసేసే ష్యూర్ షాట్ కథ కోసం మారుతి ప్రయత్నాలు చేస్తున్నాడట.
ప్రస్తుతం నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు మారుతి. ఆ తరవాత కచ్చితంగా బన్నీ సినిమాని పట్టాలెక్కించాలన్నది మారుతి ప్లాన్. తక్కువ బడ్జెట్లో, ఎక్కువ క్వాలిటీతో సినిమా చేయడం మారుతి ప్రత్యేకత. అందుకే ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే రూపొందించే అవకాశాలున్నాయి. నాగచైతన్య కథ ఓకే అయిపోవడం, ఆ సినిమా పట్టాలెక్కడానికి కాస్త సమయం మిగిలి ఉండడంతో.. బన్నీకి తగిన స్టోరీ కోసం మారుతి ప్రయత్నాలు మొదలెట్టేశాడని తెలుస్తోంది. ”మారుతి దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో ఓ సినిమా కచ్చితంగా ఉంటుంది. అదెప్పుడన్నది చెప్పలేం. బహుశా అన్నీ కుదిరితే.. నా పేరు సూర్య తరవాత బన్నీ చేసే సినిమా మారుతిదే కావొచ్చు” అని మారుతి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.