ప్రతిరోజూ పండగే తరవాత… మారుతి సినిమా ఏది? అనే విషయంపై విపరీతమైన చర్చ జరిగింది.రకరకాల వార్తలొచ్చాయి. హీరోలు మారారు. కొత్త కొత్త టైటిళ్లూ వినిపించాయి. వాటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టేశారు మారుతి. తన కొత్త సినిమా వివరాల్ని వినూత్నంగా ప్రకటించారు. గోపీచంద్ తో ఆయన సినిమా ఖాయమైంది. యూవీ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోకి.. ప్రముఖ నటుడు రావు రమేష్ వాయిస్ అందించారు. తన సినిమా పై వచ్చిన రకరకాల పుకార్ల నేపథ్యాన్ని జోడిస్తూ.. `రకరకాల వార్తలతో తాను తీయబోని సినిమాని మారుతితో తీయించేశారని కోర్టువారు నమ్మడం జరిగింది..“ అంటూ మారుతి సినిమాని ఖరారు చేసేశారు. ఫస్ట్ లుక్ తో పాటు, టైటిల్ నీ ఒకే సారి విడుదల చేయబోతున్నాడు. బహుశా.. సంక్రాంతికి ఈ కబురు వినవొచ్చు. ఈ చిత్రానికి `పక్కా కమర్షియల్` అనే పేరు పెట్టారని సమాచారం. అదే ఉంటుందా? లేదంటే మారుతుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.