ఓ మాదిరి హీరో సినిమా వచ్చి చాలా రోజులైంది. `శైలజా రెడ్డి అల్లుడు`తో ఆ లోటు తీరబోతోంది. మారుతి బ్రాండ్ – `అల్లరి అల్లుడు` టైపు కాన్సెప్ట్ తో… ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. పైగా శివగామి క్రేజ్, అనుఇమ్మానియేల్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. కాకపోతే.. మారుతిని ఓ భయం వెంటాడుతోంది. `శైలజా రెడ్డి అల్లుడు` అనే పేరు వల్ల ప్రమాదం ఏమైనా పొంచి ఉందేమో అన్నది ఆయన అనుమానం. ఎందుకంటే.. టైటిల్లో పాత వాసన కొడుతోంది. పైగా.. అత్తా అల్లుళ్ల కాన్సెప్ట్‌లో చాలా సినిమాలొచ్చాయి. అది ముతక ఫార్ములా అయిపోయింది. ఇప్పుడు అలాంటి కథల్ని చూడ్డానికి ఎవరూ ఇష్టపడడం లేదు. మారుతి కథ అత్తా అల్లుళ్ల గొడవ కాదు. అత్తకీ, అత్తకూతురికీ ఉన్న ఈగో వల్ల అల్లుడు ఎలా నలిగిపోయాడన్నది కాన్సెప్ట్. ఇప్పటి వరకూ ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. కానీ.. జనం మాత్రం ఇది రొటీన్ అత్తా అల్లుళ్ల కథ అనుకునే ప్రమాదం ఉంది. అందుకే మారుతి భయపడుతున్నాడు. `టైటిల్ పాతదే కానీ.. కథ కొత్తది`, `ఇది మామూలు అత్తా అల్లుళ్ల కథ కాదు` అని పదే పదే చెబుతున్నాడు. మొన్న మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ, నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ మారుతి ప్రసంగంలోని ముఖ్యాంశం ఇదే. పేరు పెట్టేటప్పుడే మారుతి ఈ విషయాన్ని ఆలోచించాల్సింది. ఇప్పుడు లేట్ అయిపోయింది. సినిమా విడుదలై… ఓ షో పడ్డాక.. `ఇది రెగ్యులర్ సినిమా కాదులే` అని ప్రేక్షకుడు నమ్మాక… మారుతి భయం పోతుంది. అంత వరకూ.. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. అనే అనుమానాలు మాత్రం వెండాడుతూనే ఉంటాయి.