ఈమధ్య ఓటీటీ రైట్స్ విషయంలో నిర్మాతలు తెగ బెంగ పడిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొనడం లేదని, మరీ గీచి గీచి బేరాలు ఆడుతున్నారని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గప్ చుప్‌గా మంచి బేరాలే సెట్ చేసుకొంటున్నాయి. అందులో ‘భలే ఉన్నాడే’ ఒకటి. రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా ఇది. చిత్రీకరణ దశలో ఉన్నప్పుడే నాన్ థియేట్రికల్ డీల్ అయిపోయింది. ఈటీవీ విన్ ఈ సినిమాని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. నిజానికి రాజ్ తరుణ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. అయినా సరే.. ఈ సినిమాకు ఇంత మంచి రేట్ వచ్చిందంటే కారణం.. దానిపై ఉన్న ‘మారుతి’ బ్రాండ్.
ఈ చిత్రానికి మారుతి సహ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. స్క్రిప్టు విషయంలోనూ మారుతి హ్యాండ్ ఉంది. అందుకే సినిమాపై బజ్ ఏర్పడింది. ఈటీవీ వాళ్లు ఈ సినిమాని చూసి మరీ కొనేశారు. శాటిలైట్, ఓటీటీ రెండూ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. మరోవైపు థియేట్రికల్ బిజినెస్ కూడా మొదలైంది. రాజ్ తరుణ్ సినిమా అంటే లైట్ తీసుకొనేవాళ్లు సైతం ఇప్పుడు మారుతి బ్రాండ్ చూసి ఎంక్వైరీలు మొదలెట్టారు. ఆదివారం ‘భలే ఉన్నాడే’ టీజర్ వచ్చింది. అది కాస్త ప్రామిసింగ్ గా కనిపించేసరికి.. వైబ్ ఇంకాస్త ఎక్కువైంది. రాజ్ తరుణ్ చేతిలో హిట్స్ లేకపోయినా, సినిమాలకు మాత్రం కొదవ లేదు. ఇప్పుడు తను చాలా బిజీ. చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ‘భలే ఉన్నాడే’ ఏమాత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకొన్నా… మళ్లీ రాజ్ తరుణ్ హవా మొదలైనట్టే. ఆడాళ్లంటే ఆమడదూరం పారిపోయే పాత్రలో రాజ్ తరుణ్ నటించాడు.