పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న పాకిస్తాన్ లోని జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్, అతని అనుచరులు కొందరిని అరెస్ట్ చేసినట్లు కొన్ని రోజుల క్రితం పాక్ మీడియాలో వార్తలు వచ్చేయి. ఆ తరువాత పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆ వార్తలను ఖండించారు. మసూద్ అజహర్ ని అరెస్ట్ చేసినట్లు తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. అదే రోజు సాయంత్రం పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్, మసూద్ అజహర్ ని గృహ నిర్బంధంలో ఉంచామని ప్రకటించేరు. అతనిపై విచారణ చేసి పఠాన్ కోట్ దాడిలో నిందితుడిగా దృవీకరించిన తరువాత అతనిని అరెస్ట్ చేస్తామని ప్రకటించేరు.
మసూద్ అజహర్ పఠాన్ కోట్ పై దాడికి పాల్పడ్డాడని భారత్ ఆధారాలు సమర్పించినప్పటికీ అతనిని అరెస్ట్ విషయంలో రెండు రోజుల వ్యవధిలో పాక్ ఇన్ని మాటాలు మార్చింది. పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం అతనిప్పుడు గృహ నిర్బంధంలో ఉన్నట్లు అందరూ భావిస్తున్నారు. కానీ పాక్ ప్రభుత్వం ఇంతవరకు అతనిని అరెస్ట్ చేయలేదు కనీసం గృహ నిర్బంధంలో కూడా ఉంచలేదని భారత్ నిఘా వర్గాలు కనుగొన్నాయి.
అతనొక ఉగ్రవాది అని తెలిసినప్పటికీ అతనిని అరెస్ట్ చేయడానికి పాక్ ప్రభుత్వం భయపడుతోందంటే ఆ దేశంలో ఉగ్రవాదులు ప్రభుత్వాన్నే శాశించే స్థాయిలో ఉన్నారని అర్ధమవుతోంది. కానీ ఆ కారణంగా అతనిని అరెస్ట్ చేయడానికి పాక్ వెనకాడినట్లయితే, భారత్-పాక్ సంబంధాలు మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. అలాగే పాక్ ప్రభుత్వం తమని ఏమీ చేయలేదని జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులకు మరోమారు స్పష్టం చేసినట్లవుతుంది కనుక వారు మరీ పేట్రేగిపోవచ్చును. దాని వలన భారత్, పాక్ రెండు దేశాలకు కూడా తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన ప్రభుత్వాన్ని శాశిస్తున్న పాక్ ఆర్మీ మరియు ఐ.ఎస్.ఐ.అధికారులతో గత కొన్ని రోజులుగా నిత్యం సమావేశం అవుతున్నారు. జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి బహుశః వారిని ఒప్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నరేమో? జైష్ ఉగ్రవాదుల అరెస్ట్ చేయమని భారత్ తో సహా అమెరికా తదితర దేశాలు పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. కానీ పాక్ ఆర్మీ మరియు ఐ.ఎస్.ఐ. అధికారులు, మత చాందసవాదులు, ఉగ్రవాదులు తదితరుల నుండి అంతర్గతంగా ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిళ్ళ కారణంగా పాకిస్తాన్ ఈ విషయంలో సరయిన నిర్ణయం తీసుకోగలదో లేదో అనుమానమే.