“ఆహానా పెళ్లంట” సినిమాలో అరగుండు బ్రహ్మానందానికి కు కోట శ్రీనివాసరావు ఎంత జీతం ఇస్తారు ? అందులో మళ్లీ ఫైన్స్ పేరుతో ఎంత వెనక్కి తీసుకుంటాడు . పెంచాల్సి వస్తే ఎంత పెంచుతారు ?. ఇవన్నీ చూసే వాళ్లకి హిలేరియస్సే. కానీ అరగుండు క్యారెక్టర్లో నిజంగా ఉన్న వారికి మాత్రం నరకమే. అలాంటి పరిస్థితే. తెలుగు మీడియాలో ఉన్న ఓ ప్రముఖ చానల్‌ది. ఎక్కడా దొరకలేదనో.., లేకపోతే మరేదైనా అభిమానంతోనే సంస్థనే అట్టి పెట్టుకున్న వారికి ఇచ్చేది అరకొర జీతాలే. అందులోనూ ఆహ నా పెళ్లంటలో కోటను మించిపోయిన తెలివి తేటలు చూపిస్తూండటంతో … కనీసం తాపీ మేస్త్రి పని చేసుకున్నా రోజుకు పదిహేను వందలు సంపాదించుకోవచ్చని చాలా మంది దండం పెట్టి వదిలి వెళ్లిపోతున్నారు.
కరోనా మొదటి వేవ్ వచ్చిన సమయంలో ఇంక్రిమెంట్ వేయాల్సిన యాజమాన్యం లాక్ డౌన్ పేరుతో ముఫ్పై శాతం వరకూ జీతాలు కత్తిరించింది. ఎడెనిమిది నెలల పాటు అలా జీతాలు కత్తిరించింది. వాటిని తిరిగి ఇవ్వడం అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. చివరికి మహా టీవీ అనే ఓ సంస్థను నడుపుతున్న అనామకులు కూడా కట్ చేసిన జీతాలు ఉద్యోగులకు తిరిగివ్వాలనే ఆలోచన చేశారు కానీ ఘనత వహించిన ఈ పేరు గొప్ప చానల్‌కు మాత్రం రాలేదు. అయినా ఉద్యోగులు సర్దుకుపోయారు. రెండో ఏడాది కూడా కరోనా పేరుతో ఇంక్రిమెంట్లు వేయలేదు. అయినా సర్దుకుపోయారు. మూడో ఏడాది మాత్రం ఉద్యోగులకు ఇంక్రిమెంట్ వేశారు.
ఎంత అంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు. ఇందులో ఓ లిటిగేషన్ కూడా ఉంది. ఏంటంటే.. అంత చిన్న మొత్తంలో జీతం పెంచినా లేట్ పంచ్‌లని.. పంచ్ మిస్సింగ్లని ఏదో కారణంగా చెప్పి వాటిని కూడా రాకుండా చేస్తారు. ఏ ఆఫీసులో లాస్ ఆఫ్ పే పడకుండా లీవులు పెట్టుకోమని చెబుతారు. కానీ ఈ ఆఫీసులో మాత్రం అడిగినా చెప్పరు. ఫామ్ ఇచ్చినా ఇవ్వలేదని చెప్పి శాలరీ కట్ చేస్తారు. అందుకే ఇంత కంటే అవమానం ఏమి ఉంటుందనుకున్నారో కానీ అన్ని డిపార్టుమెంట్లలో ఉద్యోగులు అభిమానాన్ని కూడా పక్కన పెట్టేసి ఎవరి దారి వారు చూసుకోవడం ప్రారంభించారు. దీంతో యాజమాన్యం కంగారు పడి మరికొంత మందికి ఇంకో ఐదు వందలు ఎక్కువ జీతం పెంచింది. అలాంటి ఆలోచనా తీరు ఉన్న ఆ చానల్ లో ఇప్పుడు మ్యాన్ పవర్ సంక్షోభంలో కూరుకుపోయంది. ఎవరు వస్తే వాళ్లని చేర్చుకోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఫలితంగా ఇప్పుడు ఆ చానల్‌కు అవుట్ పుట్ అనేది లేకుండా పోయింది.
అయితే లైవ్‌లు పెట్టుకోవడం.. ఫోనోలు.. డిస్కషన్లతో చానల్‌ను నడిపించేస్తున్నారు. ఓ పార్టీకి హార్డ్ కోర్ సపోర్ట్‌గా ఉండే ఆ చానల్ వ్యూయర్స్ కూడా అదే పార్టీకి సపోర్ట్ చేసే మరో చానల్ వైపు వెళ్లిపోతున్నారు. అయినా చేసుకున్నవారికి చేసుకున్నంత అని అక్కడ పని చేసే ఉద్యోగులు.. వదిలి వెళ్లిపోయిన ఉద్యోగులు లైట్ తీసుకుంటున్నారు. కొసమెరుపేమిటంటే అక్కడ పని చేసి వెళ్లేవారు వెళ్లిపోవాలి .. ఇంత కాలం చేశాం కదా రూల్స్ ప్రకారం మాకేమైనా వస్తాయా అని అడిగితే మాత్రం విశ్వరూపం చూపిస్తారు. లేబర్ కోర్టుల్లో ఆ సంస్థపై ఎన్ని కేసులున్నాయో చెప్పడం కష్టం. అ కథలేందో మరోసారి తెలుసుకుందాం !