ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుత ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత అనుభవాల దృష్ట్యా ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని మంత్రుల ఆదేశాలతో..వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మున్నేరు వాగుకు మరోసారి వరద ప్రమాదం పొంచి ఉందని అధికారులు ప్రకటించడంతో హుటాహుటిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం బయల్దేరి వెళ్లారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అలాగే, ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించనున్నారు.
లోతట్టు ప్రాంత ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసే సహాయ శిబిరాలకు వెళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు , ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
ఇక, ఆదివారం ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. . ఖమ్మంలోని 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.