తెలుగు360 రేటింగ్: 2.75/5
కొన్ని ఐడియాలు భలే ఉంటాయి.
విన్న వెంటనే – సినిమాలుగా పనికొచ్చేస్తాయ్ అనిపిస్తుంది.
కానీ తీరా దిగాక మాత్రమే – ఐడియాల వల్ల సినిమాలు అవ్వవు అనే నిజం తెలుస్తుంది. అయితే అప్పటికే సినిమా బయటకు వచ్చేస్తుంది.
ఆడిన ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ ఐడియా ఉండి ఉంటుంది.
కానీ ఐడియా ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేయవు.
`మత్తు వదలరా` ఐడియా కూడా చాలా కొత్తగా, క్రియేటీవ్‌గా తయారు చేసుకున్నదే. మైత్రీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ, ఓ కొత్త దర్శకుడు చెప్పిన పాయింట్‌కి ఫిదా అయ్యిందంటే – ఆ ఐడియానే కారణం.
విన్నప్పుడు థ్రిల్ ఇచ్చిన ఆ ఐడియా – తీసిననప్పుడు ఏం అయ్యింది? ఇంతకీ ఆ ఐడియా ఏమిటి? ఎలా తీశారు? చివరికి ఏం జరిగింది?
కథ
నెలంతా గొడ్డు చారికీ చేస్తే చేతికి నాలుగు వేలు కూడా జీతంగా దక్కని బాబూ మోహన్ (జై సింహా) కథ ఇది. తొక్కలో ఉద్యోగం ఉంటే ఏమిటి? పోతే ఏమిటి? అనుకుని ఎగనామం పెట్టేద్దామనుకుంటాడు. కానీ బాబూ మోహన్ స్నేహితుడు యేసు (సత్య) మాత్రం ఈ కొరియర్ బోయ్ ఉద్యోగమే చేస్తూ వేలకు వేలు ఎలా సంపాదించాలో ఓ కిటుకు చెబుతాడు. జస్ట్ కస్టమర్ దేవుడు ఏమరపాటుగా ఉన్నప్పుడు రూ.500 ఎలా నొక్కేయాలో ప్రాక్టికల్‌గా చూపిస్తాడు. ముందు `నో.. నో… ఇది దొంగతనం కదా` అనుకున్నా, యేసు హితబోధ వల్ల `ఇది దొంగతనం కాదు… తస్కరించే విద్య` అని తెలుసుకుని, స్నేహితుడు చెప్పింది ఫాలో అవుతాడు. ముందుగా ఓ ముసలమ్మ దగ్గర రూ.500 కొట్టేద్దామని ఫిక్సవుతాడు. కానీ సదరు ముసలమ్మ అతి తెలివి, చాదస్తం, ముందు జాగ్రత్తల వలన 500 తస్కరించి దొరికిపోతాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో జరిగిన అలజడిలో, తోపులాటలో ముసలమ్మ కింద పడి చచ్చిపోతుంది. అక్కడి నుంచి.. మెల్లమెల్లగా తన జీవితాన్నీ, తననీ రిస్కులో పడేసుకుంటూ వెళ్తాడు బాబూ మోహన్. రూ.500 కోసం కక్కుర్తి పడితే… తన జీవితంతో పాటు, తన స్నేహితుల జీవితం కూడా… ప్రమాదంలో పడిపోతుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఈ ఉపద్రవం నుంచి బాబూ మోహన్ ఎలా బయటపడ్డాడు? అనేదే మత్తువదలరా కథా కమామిషు.
విశ్లేషణ
ఈ సినిమాలో షెర్లాక్ హోమ్స్ ని పోలిన పాత్ర ఒకటి ఉంటుంది. ఎప్పుడూ షర్లాక్ సినిమాలు చూస్తూ, ఆ స్థాయిలో ఆలోచిస్తుంటాడు. సినిమా మొదలెట్టినప్పుడు కూడా షర్లాక్ హోమ్స్ స్థాయిలో కథ, కథనాలు ఉన్నాయనిపిస్తుంది. కథని చాలా స్లో ఫేజ్‌లో మొదలెట్టడం, హీరో కష్టాలు, సత్య ఉపదేశం, రూ.500 కొట్టేయడానికి ముసలమ్మ దగ్గర చేసిన ప్రయత్నం.. ఆ ప్రయత్నంలో ముసలమ్మ కిందపడి చనిపోవడం – అక్కడి నుంచి కథ ఊపందుదకోవడం పర్ఫెక్ట్ సింక్‌లో జరిగాయి. ధోనీ ఆడే టీ 20 ఇన్నింగ్స్‌లా చినుకులా మొదలై.. కుంభవృష్టి కురిసిన ఫీలింగ్ కలుగుతుంది.
హీరో ఓ ఆపార్ట్‌మెంట్‌లో లాక్ అయిపోయాడు. అక్కడే ఓ మర్డర్ జరిగింది. ఆ హత్య నుంచి తాను బయట పడాలి. ఆ సన్నివేశాలన్నీ దాదాపు అరగంట సాగుతాయి. ఆ అరగంటా హీరో ఒక్కడినీ, అతని ప్రయత్నాల్నీ మాత్రమే చూపిస్తే బోర్ కొట్టేస్తుంది. ఓ సగటు సినిమాని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే హీరో భ్రమలో… మిగిలిన ఇద్దరు స్నేహితుల పాత్రల్నీ ఎంటర్ చేయడం, ఆ స్నేహితులతు తన తో పాటు ఆ గదిలోనే ఉన్నట్టు హీరో ఊహించుకోవడం, ఓ పాత్ర షెర్లాక్ హోమ్స్ తరహాలో తప్పించుకోవడానికి మార్గాలు సూచిస్తుంటే, మరో పాత్ర (సత్య) కామెడీ చేయడం చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. ఆ సన్నివేశాలు చూస్తున్నంత సేపూ దర్శకుడి స్క్రీన్ ప్లే నైపుణ్యానికీ, అవుటాఫ్ ది బాక్స్ ఐడియాకీ దాసోహం అనాలనిపిస్తుంది.
కథని మొదలెట్టేటప్పుడే దానికి సమాంతరంగా ఓ టీవీ సీరియల్ నీ చూపిస్తుంటాడు. నుదిటి లోంచి బుల్లెట్ దూసుకుపోయినా – కామెడీ చేసేసే ఆ టీవీ సీరియల్ హీరో చూట్టూ బోల్డెంత ఫన్. ఈ దర్శకుడిలో వెటకారం పాళ్లు కూడా కాస్త ఎక్కువే అనిపిస్తుంది. తొలి సగంలో దర్శకుడు ఏం చేసినా చెల్లిపోయింది. కొద్దిపాటి లోపాలున్నా సత్య చేసే కామెడీ, టీవీ సీరియల్ ని చూపిస్తూ ఎంటర్టైన్ చేయడం – బాగా కలిసొచ్చాయి. ఇంట్రవెల్లో బయటకు వచ్చిన ప్రేక్షకుడిని చాలా ప్రశ్నలు తొలిచేస్తుంటాయి. ఈ హత్య నుంచి హీరో ఎలా బయటపడతాడు? హీరో బ్యాగులో 50 లక్షలు ఎలా వచ్చాయి? హీరో ఇంటి ముందున్న పోలీస్ ఎవరు? హీరో అపార్ట్మెంట్ నుంచి పారిపోతున్నప్పుడు అక్కడున్న మరో శవం ఎవరిది? ఇలా ఎన్నో ప్రశ్నలు తొలుస్తుంటాయి. వీటిని దర్శకుడు ఎలా హ్యాండిల్ చేశాడా? అనిపిస్తుంటుంది. ఇన్ని ఆలోచనలకు తావిచ్చాడంటే తొలిభాగం సక్సెస్ అయిపోయినట్టే.
ఇక ద్వితీయార్థం అసలు తమాషా మొదలవుతుంది.
ఇంట్రవెల్ ముందు హీరో ఇంటి ముందు తలుపు తట్టిన పోలీస్ పాత్రని తూచ్ చేయడం దగ్గర్నుంచే దర్శకుడి ఎస్కేపిజం మొదలవుతుంది. హీరో తన స్నేహితులతో ఫ్లాటుకి వెళ్లడం వరకూ బాగుంటుంది. అక్కడ డ్రగ్స్ మాఫియా అనే మరో లేయర్ ఎంటర్ అవ్వడంతోనే కథలో ఏం జరిగి ఉంటుందన్నది కాస్త కాస్త ప్రేక్షకుడికి అర్థమవుతుంది. కథలో ఇంకో మలుపు కావాలి.. అని దర్శకుడు బలంగా ఫీలయ్యి, ప్రీ క్లైమాక్స్ ట్విస్టు ఇచ్చాడనిపిస్తుంది. బలవంతంగా పాజిటీవ్ పాత్రల్ని నెగిటీవ్ పాత్రగా మలిచాడన్న ఫీలింగ్ వస్తుంది. ఓ అపార్ట్మెంట్లో రహస్యంగా గంజాయి మొక్కల్ని పెంచడం, వాటి చుట్టూ క్రైమ్ నడపడం నమ్మశక్యంగా అనిపించని విషయాలు. షర్లాక్ హోమ్స్ తరహాలో మొదలైన ఈ కథ.. చివరికి వచ్చే సరికి ఫక్తు క్రైమ్ కామెడీగా మారిపోతుంది. సినిమా అంతా చూశాక… కొత్త డౌట్లు పుట్టుకొస్తుంటాయి. తొలి భాగంలో రఫ్ఫాడించిన దర్శకుడు.. ద్వితీయార్థంలో మాత్రం తన తెలివితేటల్ని, అవుటాఫ్ ది బాక్స్ ఆడియాల్ని కట్టకట్టి అటకెక్కించేశాడనిపిస్తుంది.
టీవీ సీరియల్‌ని ఎంత కామెడీ చేశాడో… క్లైమాక్స్ లో తన టేకింగ్ కూడా అలానే తయారవ్వడం – విధి వైచిత్రి. బ్రహ్మాజీ మెడలో ఇంత పెద్ద పుల్ల గుచ్చుకున్నా – చాలా మామూలుగా డైలాగులు చెబుతూ… చాలా దూరం నడిచి.. అక్కడ పడిపోతాడు. టీవీ సీరియల్లో హీరోకీ.. బ్రహ్మాజీకీ పెద్ద తేడా కనిపించలేదక్కడ.
నటీనటులు
కీరవాణి అబ్బాయి జై సింహా తొలిసారి తెరపై కనిపించాడు. గుబురు గడ్డంలో తనని చూడలేకపోయాం. అసలు గడ్డంతో ఇంట్రడక్షన్ ఎందుకు ఇప్పించారో. ఎప్పుడైతే ఆ గడ్డం ముసుగు తీశాడో అప్పుడే చూడగలిగాం. ఎక్స్ప్రెషన్లూ కనిపించాయి.
తను చక్కగా చేశాడు. తొలి సినిమా అన్న ఫీలింగ్ ఎక్కడా కనిపించలేదు. జూనియర్ షెర్లాక్లా కనిపించిన నరేష్ అగస్త్య కూడా బాగా నటించాడు. తన పాత్ర కీలక మలుపులకు కారణం అవుతుంది. ఇక సత్య ఈ సినిమాకి పిల్లర్ అయిపోయాడు. సత్య కామెడీ చాలా పెద్ద రిలీఫ్. తొలి సగంలో సత్య పాత్రని ఈ స్థాయిలో వాడుకోకపోతే… సినిమా ఇంకా బోర్ కొట్టేసేది. వెన్నెల కిషోర్ ఓకే అనిపిస్తాడు. మిగిలినవాళ్లెవరికీ పెద్దగా స్కోప్ లేదు.
సాంకేతిక వర్గం
కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతం అందిచాడు. పాటలకు ఈ సినిమాలో స్కోప్ లేదు. నేపథ్య సంగీతంతో మాత్రం ఆకట్టుకున్నాడు. తన ఆర్.ఆర్తో కథలో ఇన్వాల్వ్ అవ్వగలిగారు. `హూ. హూ.. ` అంటూ సాగే థీమ్.. కొత్తగా వినిపించింది. కెమెరా పనితనం బాగుంది. దర్శకుడి స్క్రీన్ ప్లే (తొలి భాగంలో) నచ్చుతుంది. కామెడీకి స్కోప్లేకపోయినా.. తన కథనంలోనే దానికి చోటిచ్చి వినోదాన్ని పంచాడు. టీవీ సీరియల్‌పై అతి పెద్ద సెటైర్ వేశాడు. చిరంజీవి అంటే ఈ దర్శకుడికి బాగా ఇష్టం అనుకుంటా. ఈ సినిమా చిరు తో మొదలవుతుంది. చిరుతో ఇంట్రవెల్ ఇచ్చాడు. చిరుని చూపించే సినిమాని ముగించాడు. ద్వితీయార్థంలో కూడా తన తెలివితేటల్ని చూపించగలిగితే… చాలా మంచి క్రైమ్ కామెడీ సినిమా అయ్యేది. అవుటాఫ్ ది బాక్స్ ఐడియాని తృటిలో పాడు చేసుకున్నాడు.
తెలుగు360 రేటింగ్: 2.75/5