ఈ గురువారం 2 సినిమాలొచ్చాయి. ఒకటి మట్కా, రెండోది కంగువా. ఈ రెండు సినిమాలకు వచ్చిన టాక్ ఏమంత గొప్పగా లేదు. కంగువాకు కాస్తో కూస్తో వసూళ్లు బాగున్నాయి. మట్కాకు అది కూడా లేదు. సినిమా కథేంటి, కథనాలు ఎలా ఉన్నాయి, మేకింగ్ వాల్యూస్ సంగతేంటి? అనేది పక్కన పెట్టండి. ఈ సినిమాల కోసం అటు సూర్య, ఇటు వరుణ్ తేజ్ బాగా కష్టపడ్డారు. వరుణ్ తేజ్ ఇదివరకెప్పుడూ లేనంత యాక్టీవ్ గా `మట్కా` కోసం ప్రమోషన్లు చేశాడు. ఏపీ, తెలంగాణ మొత్తం తిరిగాడు. ప్రీ రిలీజ్ లో ఎగ్రసీవ్ గా మాట్లాడాడు. తెరపై అంతకు వందింతలు కష్టం. తన మేకొవర్ అదిరిపోయింది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో మార్పు కనిపించింది. నటుడిగా ఎదిగాడు. పాత్రని అర్థం చేసుకొని, అందులో ఇమిడిపోయాడు. అయితే సినిమాకు రిజల్ట్ బాగున్నప్పుడే ఈ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు. మట్కాకు వచ్చిన రిపోర్ట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వరుణ్ నటనకు పడుతున్న మార్కులు చూసి మురిసిపోవాలంతే.
ఇక కంగువాకు మరింత కష్టతరమైన సమయం ఇది. విడుదలకు ముందు ఈ సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. తమిళ నాట వెయ్యి కోట్లు కొల్లగొట్టగలిగే సినిమా ఇదన్నారు. తెలుగులో కూడా మామూలు స్పందన రాలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా భారీగా చేశారు. తెరపై సూర్య ఎప్పటిలానే కష్టపడ్డాడు. నెల రోజుల ముందు నుంచీ ఈ సినిమాకు గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. వన్ మాన్ ఆర్మీలా మారి, తానొక్కడే ప్రమోషన్ బాధ్యత తన భుజాలపై వేసుకొని ప్రపంచమంతా తిరిగాడు. కానీ తలా తోకా లేని కథ, అర్థం కాని క్యారెక్టరైజేషన్లు, లౌడ్ నటన… వీటి మధ్య కంగువా నలిగిపోయింది. ఏం నమ్మి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారో, ఏది చూసుకొని సూర్య ఇంత కష్టపడ్డాడో ఎవరికీ అర్థం కావడం లేదు. పార్ట్ 2 అంటున్నారు కానీ, దానిపై ఆశ వదులుకోవడం మంచిదన్నది తమిళ వర్గాల టాక్. హార్డ్ కోర్ సూర్య ఫ్యాన్స్ సైతం శివ తమ నమ్మకాన్ని ఒమ్ము చేశాడంటూ బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
ఏది ఏమైనా అటు సూర్య, ఇటు వరుణ్ ఇద్దరూ ఈ వారం ఫలితాలతో భంగపడ్డారు. వాళ్ల కష్టం వృథా అయ్యింది. కథని ఎంచుకొనేటప్పుడే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఉంటే, ఈ భంగపాటు తప్పేదేమో.