Matka Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2/5
-అన్వర్-
వరుణ్‌తేజ్‌పై ముందు నుంచీ ఓ ఇంప్రెషన్ ఉంది. తన కథల ఎంపిక బాగుంటుందన్న మంచి అభిప్రాయం సంపాదించుకొన్నాడు. అయితే ఈమధ్య ఎందుకో తన జడ్జిమెంట్ రాంగ్ అవుతోంది. దానికి రకరకాల కారణాలు. వరుస పరాజయాలతో తన కెరీర్ గాడి తప్పింది. ఈ దశలో ఎంచుకొన్న సినిమా ‘మట్కా’. దేశం మర్చిపోయిన ఓ గ్యాంబ్లింగ్ మట్కా. ఆ ఆట ఇతివృత్తంగా ఇప్పటి వరకూ సినిమా రాలేదు. పైగా వరుణ్ తేజ్ గెటప్పులు ఆసక్తిని కలిగించాయి. ‘పలాస’తో విషయం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న కరుణకుమార్ పేరు కూడా యాడింగ్ ఎలిమెంట్ అయ్యింది. మరింతకీ ఈ మట్కా ఎలా వుంది? వరుణ్ తేజ్ వరుస వైఫల్యాలకు బ్రేక్ ఇచ్చిందా? తనకు బ్రేక్ వచ్చిందా?
ఇది వాసు (వరుణ్‌తేజ్) అనే కుర్రాడి కథ. తన బాల్యం, ఎవ్వనం, తన జీవితంలో గెలుపు ఓటములు, ఆటుపోట్లూ.. ఇదే ఈ కథ. ఓ రకంగా వాసు అనే కుర్రాడి బయోపిక్ అనొచ్చు. చిన్నప్పుడే ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్తాడు వాసు. సాధారణంగా జైలు శిక్ష మనిషిలో మార్పు తీసుకొస్తుందంటారు. కానీ అక్కడ మరింత రాటు తేలిపోతాడు వాసు. జైలు నుంచి తిరిగొచ్చి విశాఖపట్నం చేరతాడు. అక్కడ పూర్ణ మార్కెట్ లో కూలీగా పనికి కుదురుతాడు. యజమాని (అజయ్ ఘోష్) ని రక్షించి, ఆ వ్యాపారంలోనే వాటా తీసుకొంటాడు. అక్కడి నుంచి ఒకొక్క మెట్టూ ఎదిగి, మట్కా కింగ్ గా మారతాడు. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేసే శక్తిలా ఎలా ఎదిగాడు? అనేది మిగిలిన కథ.
ఈ సినిమాకు ‘మట్కా’ అనే పేరు పెట్టి పొరపాటు చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ‘మట్కా’ అనేది ఈ కథలో చిన్న భాగం మాత్రమే. ‘మట్కా’ అనేగానే ఇదోదో గ్యాంబ్లింగ్ చుట్టూ నడిచే కథ అనుకొంటారు. అక్కడ కాస్త అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. వాసు కథగా చూస్తే.. ఇదో బయోపిక్‌లా, ఓ వ్యక్తి జీవితానికి సంబంధించిన డాక్యుమెంటరీలానో అనిపిస్తుంది. వాసు బాల్యంతో ఈ కథ మొదలవుతుంది. అన్నం పొట్లం కోసం పడిన గొడవతో వాసు హంతకుడిగా మారి, జైలుకి వెళ్లడం, అక్కడ జైలర్ వాసు ధైర్యాన్ని వాడుకొని డబ్బులు సంపాదించడం.. ఈ ఎపిసోడ్లు అన్నీ ఆసక్తికరంగానే సాగాయి. హీరోయిజం ఫస్ట్ సీన్ నుంచే ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. ఆ సన్నివేశాలు మాస్‌కి నచ్చుతాయి. వాసు విడుదలై పూర్ణ మార్కెట్ కి రావడం, అక్కడ ఒకొక్కడ్నీ కొడుతూ పై స్థాయికి చేరుకోవడం ఇంట్రవెల్ కి ముందు మట్కా ఆటని పరిచయం చేయడం ఇలా కథ సాగిపోతుంటుంది. మధ్యలో కథానాయికతో లవ్ స్టోరీకి కాస్త స్కోప్ ఇచ్చారు. అదేమంత ఎఫెక్టీవ్ గా కనిపించదు. రెగ్యులర్ మాస్ కథలకు మట్కా భిన్నంగా ఉండడం, వరుణ్ తేజ్ గెటప్పులతో ఫస్టాఫ్ ఓకే అనిపిస్తుంది. రైలులో తోటి ప్రయాణికులతో మట్కా ఆడించే ఎపిసోడ్ కాస్త బాగా తీశాడు దర్శకుడు. క్లిష్టమైన ఈ ఆట గురించి సులభంగా అర్థమయ్యేలా ఆ సీన్ డిజైన్ చేశారు. ఆ ఎఫెక్ట్ లేకపోతే అసలు మట్కా అంటే ఏమిటో కూడా ప్రేక్షకులకు తెలిసేది కాదు.
సెకండాఫ్‌తో కాస్త సమస్య ఉంది. కథలో హైస్ లేకపోవడం, కథాగమనం ప్రేక్షకుడి ఆలోచనలకు అనుగుణంగానే సాగడం ఇబ్బంది పెడతాయి. నేరేషన్ కూడా చాలా స్లోగా ఉంది. కూతుర్ని కూర్చోబెట్టుకొని ‘మేక’ కథ చెప్పే ఎపిసోడ్ అయితే… ప్రేక్షకుల సహనానికి పరీక్షే. థియేటర్ అంతా నిద్రమత్తులో జారుకొనే సీన్ అది. దాదాపు 5 నిమిషాల పాటు సాగింది. అదంతా సింగిల్ టేక్ లో తీసిన ఫీలింగ్ కలుగుతుంది. వరుణ్ కూడా ఆ డైలాగులు బాగా చెప్పాడు. కాకపోతే.. మరీ లెంగ్త్ ఎక్కువ అయిపోవడంతో ఎమోషన్, ఫీల్ మిస్సయ్యాయి. ఈ కథలో బలమైన విలన్ మిస్సయ్యాడు. కేబీ, అమ్మోరు… ఇలాంటి పాత్రల్ని మొదట్లో ఇంట్రడ్యూస్ చేసినా, మధ్యలో డమ్మీలుగా మార్చేశాడు. చివర్లో వాళ్లు యాక్టివేట్ అయినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. మట్కా గేమ్ మొత్తం ఓ పాటలో చూపించేశారు. ఆ పాట తరవాత.. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిందంటూ ప్రధాన మంత్రి (ఇందిరా గాంధీ ని పోలిన పాత్ర) ఓ మీటింగ్ పెడుతుంది. మట్కా వల్ల దేశ వ్యవస్థ అంతలా ఎలా చిదికిపోయినప్పుడు కనీసం బలమైన సన్నివేశాల్లో ఆ ఎఫెక్ట్ చూపించగలగాలి కదా?
అండర్ డాగ్ కథలెప్పుడూ ప్రేక్షకుల్ని ఉత్సాహపరుస్తుంటాయి. తాము చేయలేని పని, తెరపై హీరో చేస్తుంటే చూసి సంతోషిస్తారు. తామే విజయం సాధించినట్టు పొంగిపోతారు. ఆ మ్యాజిక్ ఉన్న కథ ఇది. అయితే.. ఆ ఉత్సాహం, ఆనందం వాసు పాత్రతో జర్నీ చేస్తున్నప్పుడు కలగవు. అంటే.. ఆ పాత్రని ప్రేక్షకుడు పూర్తిగా ఓన్ చేసుకోలేకపోయాడన్నమాట. ఒకడు జీరో నుంచి హీరోగా మారడం, మధ్యలో అడ్డొచ్చిన శ్రత్రుగణాన్ని చివర్లో రూపుమాపడం ఇదంతా రొటీన్ ఫార్మెటే. దానికి మట్కా అనే నేపథ్యాన్ని మాత్రం జోడించాడు దర్శకుడు. కొన్నిసార్లు ఈ కథ కమర్షియల్ సినిమాగా, ఇంకొన్నిసార్లు బయోపిక్ లా, ఇంకొన్నిసార్లు డాక్యుమెంటరీగా అనిపిస్తుంది. కథనంలో వేగం లేకపోవడం, హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నా వాటిని సరిగా డిజైన్ చేసుకోలేకపోవడం ప్రధానమైన లోపం.
వరుణ్ తేజ్ నూటికి రెండొందల శాతం కష్టపడ్డాడు. తన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అన్నిటికీ న్యాయం చేశాడు. ఒక్కో పాత్రకు తగ్గట్టుగా డబ్బింగ్ లోనూ వైవిధ్యం చూపించాడు. కథ, కథనాల్లోని లోపాల వల్ల ఆ కష్టం పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మీనాక్షి చౌదరి మరీ పీలగా ఉంది. ఆ పాత్రని మరీ అంత డీ గ్లామర్ గా చూపించాల్సిన అవసరం లేదు. సలోనిని ఓ చోట ఫ్రీజ్ చేసి, చూపించడం మంచిదైంది. లేదంటే ఈ సినిమాలో సలోని ఉందన్న విషయాన్ని ఎవరూ రిజిస్టర్ చేయలేకపోయేవారు. నౌరా ఫతేహీ వ్యాంపు తరహా పాత్ర పోషించింది. ఆమె గ్లామర్ ని సైతం సరిగా వాడుకోలేదు. విలన్ పాత్రల్ని ముందు గంభీరంగా చూపించడం, ఆ తరవాత వాళ్లని సైలెంట్ చేసేయడం ఈ సినిమాలోనూ కనిపించింది. విలన్లు ఎప్పుడైతే వీక్ అయ్యారో అప్పుడు హీరోయిజం ఢమాలున పడిపోతుంది. ఈ విషయం కరుణ కుమార్ లాంటి రచయిత గుర్తు పెట్టుకోకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది.
సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. పిరియాడిక్ లుక్ తీసుకురావడానికి శ్రమించారు. కాస్య్టూమ్స్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి. పాటలు ఓకే అనిపిస్తాయి. చివర్లో వచ్చే ఫోక్ సాంగ్ బాగుంది కానీ.. రాంగ్ ప్లేస్మెంట్. ఆ పాట ముగిసిన వెంటనే మరో పాట వచ్చి పడిపోతుంది. సినిమా క్లైమాక్స్ కి ముందు వరుసగా రెండు పాటలు రావడం స్క్రీన్ ప్లే పరంగా ఇబ్బంది కలిగించే అంశమే. కరుణ కుమార్ మంచి రైటర్. తనలో స్పార్క్ చాలాచోట్ల కనిపించింది. డైలాగులు బాగా పేలాయి. అయితే కథపరంగానే తప్పు చేశాడు. ఓ రొటీన్ ఫార్ములాని పట్టుకొని, దానికి మట్కా నేపథ్యం మాత్రమే కొత్తగా జోడించాడు. కథనంలో వేగం ఉండి, వాసు కథని సామాన్యుడు కనెక్ట్ అయ్యేలా రాసుకొని ఉంటే ఫలితం ఉండేది. వరుణ్ గెటప్పులూ, తన కష్టం కోసం.. వరుణ్ తేజ్ అభిమానులు ఈ సినిమా చూడొచ్చు.
తెలుగు360 రేటింగ్: 2/5
-అన్వర్-