బాక్సాఫీసు దగ్గర మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈసారి ఓ తెలుగు సినిమా, ఓ డబ్బింగ్ బొమ్మతో తలపడబోతోంది. రెండూ క్రేజీ సినిమాలే. సూర్య – శివ కాంబోలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం `కంగువా` ఈవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. నవంబరు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ఈ సినిమాకు మంచి థియేటర్లే దొరికాయి. ఉదయం 4 గంటల ఆటకు ప్రత్యేక అనుమతి తీసుకొన్నారు నిర్మాతలు. తెలుగులో బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. రిలీజ్ ట్రైలర్ కూడా ఊపు తెచ్చింది. ప్రేక్షకులకు కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చిత్రబృందం కష్టపడిందన్న విషయం ప్రచార చిత్రాలు చెబుతున్నాయి. తమిళ నాట ఈ చిత్రానికి విపరీతమైన హైప్ వచ్చింది. అన్నీ కుదిరితే…. భారీ వసూళ్లు చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
వరుణ్ తేజ్ – కరుణ కుమార్ కాంబోలో రూపొందిన చిత్రం `మట్కా`. దాదాపు రూ.60 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందించారు. వరుణ్ కెరీర్లో ఖరీదైన సినిమా ఇది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. మరీ ముఖ్యంగా వరుణ్ గెటప్పులు మాస్కు నచ్చేలా ఉన్నాయి. డైలాగులు కూడా అర్థవంతంగా సాగాయి. మేకింగ్ లో క్వాలిటీ కనిపించింది. వరుణ్‌కి మంచి హిట్ పడి చాలా కాలమైంది. ఈ సినిమాపై తను కూడా గట్టి నమ్మకంగా ఉన్నాడు. దీపావళికి తెలుగు నాట మంచి సినిమాలు వచ్చాయి. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల సందడి కనిపించింది. ఒకేసారి రెండు సినిమాలు వచ్చినా పెద్ద నష్టం లేదు. కంటెంట్ బాగుంటే రెండు సినిమాలూ చూస్తారు. కాబట్టి మట్కా, కంగువా మధ్య పోటీ ఉన్నా, అది వసూళ్లపై ఎఫెక్ట్ చూపించే అవకాశం లేదు. రెండింటికీ మంచి టాక్ వస్తే … మరోసారి బాక్సాఫీసు దగ్గర వసూళ్ల మోత వినిపిస్తుంది.