ఇందూ టెక్ జోన్‌కు సంబంధించి మారిషస్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయడం కన్నా ఆ విషయమై ప్రధాని మోడీకి నోటీసు జారీ కావడం న్యాయ వర్గాలను కుదిపేస్తున్నది.షరా మామూలుగా దీన్ని తెలుగుదేశం అనుకూల మీడియా జగన్ వల్ల కలిగిన కళంకంగా చిత్రిస్తే సాక్షి ఎల్లో మీడియా కుట్రగా ప్రధాన వార్త ఇచ్చింది. వ్యాపార సంస్థల కేసుల్లో జగన్‌కు సంబంధమేమిటని ప్రశ్నించింది. అయితే ఈ సమస్య ఉత్పన్నమైంది జగన్‌పై కేసుల క్రమంలోనే గనక ఆ విమర్శ నిలిచేది కాదు. కాకుంటే ఈ నోటీసు ప్రభావం జగన్‌పై ఎలా వుంటుందనేదానికి రెండు కోణాలు కనిపిస్తున్నాయి. ఆయనపై అనవసరంగా కేసులు పెట్టడం కోసం వ్యాపార ఒప్పందాలపై వివాదాలు సృష్టించి అంతర్జాతీయంగా నష్టం తెచ్చారని ఒక వాదన. గతంలో కొందరు ఐఎఎస్‌లు కూడా విడుదలైనారు. ఈ ప్రకారమైతే జగన్ గాక కేసు పెట్టిన వారికి ఎక్కువ బాధ్యత వుంటుంది. ఇక రెండవది ఇప్పటికే అవినీతి కేసులు నడుస్తున్నప్పుడు మనం చేరదీస్తే ఆ కళంకం మనకూ అంటుతుందని బిజెపిలో జగన్ వ్యతిరేక వర్గం వాదించవచ్చు. ఎందుకంటే ఆ పార్టీలో అనుకూల వ్యతిరేక వాదులు వుండనే వున్నారు. చివరకు ప్రధాని మోడీ అమిత్ షాలే భావి వ్యూహం ఖరారు చేయొచ్చు. అంతర్జాతీయ సంస్థలు వున్న సందర్భంలో లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దని ప్రభుత్వం భావిస్తే అప్పుడు ఇందుటెక్ జోన్ వంటి కేసులలో సడలింపు కనపర్చవచ్చు. దానివల్ల జగన్‌కు మేలు జరుగుతుంది. ప్రత్యేక హౌదా సమస్య వచ్చాక బిజెపి వైసీపీలను కలిపి మాట్లాడుతున్న సమయంలోనే ఈ కేసు కూడా రావడం వల్ల కేంద్రం వైఖరి ఎలా వుంటుందో తెలుసుకునే వీలు కలిగింది. దీన్ని తమకు అనుకూలంగా చూపించుకోవడానికి టిడిపి వైసీపీ మీడియాలు ప్రయత్నించవచ్చు గాని పిలక మాత్రం ఢిల్లీ చేతుల్లో వుండిపోయింది.