భారత సర్కారును మారిషస్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయం స్థానానికి ఈడ్చింది..! ఎందుకంటే, ఇందు టెక్ జోన్ పెట్టుబడుల అంశమై ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించినందుకు! ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ ఛార్జ్ షీటు దాఖలు చేసిన తరువాత.. ఆ కంపెనీ ఒప్పందం ప్రకారం పనులను ప్రారంభించలేకపోయింది. దీంతో తమకు భారీ నష్టం వాటిల్లిదంటూ మారిషస్ కు చెందిన కెరిస్సా ఇన్వెస్టిమెంట్స్ ఎల్.ఎల్.సి. తరఫున ఆ ప్రభుత్వం కోర్టుకెక్కింది.
నిజానికి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ హయాంలో ఇందు టెక్ జోన్ కు దాదాపు 250 ఎకరాల భూమిని అలాట్ చేశారు. కనీసార్హతలు లేకపోయినా ఆ కంపెనీకి నాడు ఏపీఐఐసీ భూములు కట్టబెట్టిందని ఇటీవలే దాఖలైన ఛార్జ్ షీటులో ఈడీ పేర్కొంది. అంతేకాదు, సెజ్ అనుమతి వచ్చిన తరువాత, అందులోని 100 ఎకరాలను తన కుమారుడు పేరిట ఇందు శ్యామ్ ప్రసాద్ బదిలీ చేశారనీ, నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన రెండు కంపెనీలకు వాటాలు విక్రయించినట్టుగా ఈడీ పేర్కొంది. ఈ కేసు విషయంలో జగన్ తోపాటు పలువురుకి ఇటీవలే కోర్టు సమన్లు పంపింది.
అలా ఆ సెజ్ చట్టపరమైన చిక్కుల్లో ఇరుకుంది. దీంతో ఇందు టెక్ జోన్ లో 49 శాతం వాటాదారుగా ఉన్న కెరిస్సా సంస్థ కూడా చిక్కుల్లో పడ్డట్టే అయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా ఈ సంస్థ ఇండియాకు వచ్చింది. తమ దేశానికి చెందిన సంస్థ నష్టపోతోంది కాబట్టి, ద్వైపాక్షిక పెట్టుబడుల రక్షణ ఒప్పందం ప్రకారం భారత్ సర్కారుపై మారిషస్ ప్రభుత్వం కేసు పెట్టింది.
కెరిస్సా కంపెనీని భారత్ సర్కారు మోసం చేసిందంటూ మారిషస్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో ఇప్పటికే నోటీసులు పంపినట్టు సమాచారం. ఆర్థికలావాదేవీల మధ్యవర్తిత్వానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి చెప్పిన ఇంటర్నేషనల్ ట్రేడ్ లా గురించి కూడా ఈ నోటీసులో ఊటకించింది. దీన్లో ప్రధానమంత్రితోపాటు ఆర్థికమంత్రి, న్యాయశాఖ మంత్రి, వాణిజ్య శాఖ, పట్టణ వ్యవహారాల శాఖల మంత్రులను కూడా ప్రతివాదులుగా పేర్కొంది. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ను ప్రతివాదిగా చేర్చకపోయినా.. జగన్ పై దాఖలైన ఛార్జ్ షీటును ప్రస్థావించింది.
సీబీఐ, ఈడీ వద్ద కేసు పెండింగ్ లో ఉండటం వల్ల కెరిస్సా కంపెనీ పెట్టుబడులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని మారిషస్ ప్రభుత్వం అంటోంది. దీంతో కేంద్రం స్పందించి, తదుపరి చర్యల కోసం, మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నాలకు సిద్ధమౌతున్నట్టు కథనం.