Max Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
ఒక్క రాత్రిలో జరిగే కథ అంటే కార్తి ‘ఖైదీ’ సినిమానే గుర్తుకు వస్తుంది. కన్నడ హీరో కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ ట్రైలర్ చూసినప్పుడు ఖైదీ ఛాయలు కనిపించాయి. చెప్పుకోదగ్గ ప్రచారం లేకుండానే సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. మరి సింగిల్ నైట్ లో డిజైన్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది. ఖైదీ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా?
ఇన్స్పెక్టర్ అర్జున్ మహాక్షయ్ అలియాస్ మాక్స్ (కిచ్చా సుదీప్) భయమే తెలియని డేరింగ్ ఆఫీసర్. ఎవరికీ తలవొగ్గని పనితీరు కారణంగా వరుస బదిలీలు, సస్పెన్షన్లు తనకి అలవాటే. ఓ కేసులో సస్పెన్షన్ గడువు పూర్తి చేసుకొని మళ్ళీ జాయిన్ అవ్వాలని ఓ రాత్రి పూట ప్రయాణం ప్రారంభిస్తాడు మ్యాక్స్. ఉదయాన్నే జాయినింగ్. ఆ రాత్రి అనుకోని పరిస్థితిలో ఇద్దరు మంత్రుల కొడుకులని అరెస్ట్ చేసి సెల్ లో వేస్తాడు. అనూహ్యంగా ఆ ఇద్దరు సెల్ లో గొడవ పడి స్టేషన్ లోనే చనిపోతారు. ఈ సంగతి బయటికి తెలిస్తే ఆ మంత్రుల మనుషులు పోలీసుల్లో ఒక్కరిని కూడా వదలకుండా చంపేస్తారు. స్టేషన్ లో స్టాప్ అంతా ఈ గండం నుంచి బయటపడేయాలని మ్యాక్ ని ప్రాధేయపడతారు. తర్వాత మ్యాక్స్ ఏం చేశాడు? మంత్రులు కొడుకుల చావుకి అసలు కారణం ఏమిటి? పోలీసులని వెదుక్కుంటూ వచ్చిన రౌడీ మూకలని మ్యాక్స్ ఎలా అడ్డుకున్నాడు? ఇదంతా తెరపై చూడాలి.
సింగిల్ త్రెడ్ కథని ప్రేక్షకులు చూపు తిప్పనివ్వకుండా చెప్పొచ్చుని లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమా రుజువు చేసింది. మ్యాక్స్ సినిమాని కూడా ఓ కొత్త ఇతివృత్తం ఎంచుకొని ఖైదీ అడుగుజాడల్లో నడపాలని చూశాడు దర్శకుడు. నిజానికి ఈ ప్రయత్నం మ్యాక్స్ తొలిసగంలో సుమారుగా వర్క్ అవుట్ అయ్యింది. ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తున్న ఇద్దరు మంత్రులు, ఓ డెన్ లో రౌడీ గ్యాంగుల విందులు, విధుల్లో చేరడానికి వచ్చే ఓ అధికారి.. ఇలా మూడు డిఫరెంట్ ట్రాక్స్ లో మ్యాక్స్ కథ మొదలౌతుంది. మొదట్లో కాస్త గజిబిజిగా వుంటుంది. మంత్రుల కొడుకులని అరెస్ట్ చేసి సెల్ లో వేయడంతో కథ ట్రాక్ లో పడుతుంది. ఎప్పుడైతే ఆ మంత్రులు కొడుకులు చనిపోయారో అక్కడి నుంచి వాట్ నెక్స్ట్ అనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ అవుతుంది.
మ్యాక్స్ వేసే ఎత్తుగడలు ఏకపక్షంగా వున్నప్పటికీ ఆ పోలీసులు భయం కారణంగా వారంతా ఈ కేసు నుంచి బయటపడితే బావుండనే సింపతి క్రియేట్ చేయగలిగారు. పోలీస్ స్టేషన్ పైకి దూసుకొచ్చే వందలాది రౌడీలని ఎదుర్కొని బయటపడటం ఖైదీ ట్రీట్మెంట్ ని గుర్తుకు తెస్తుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కూడా సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచింది.
అయితే మ్యాక్స్ లో అసలు సమస్య సెకండ్ హాఫ్ లో మొదలౌతుంది. అప్పటివరకూ వర్క్ అవుట్ అయిన సెటప్ ని దర్శకుడు కమర్షియల్ మాస్ మసాలా ట్రీట్మెంట్ వైపు తిప్పాడు. ఇది ఏ రేంజ్ లో ఉంటుందదంటే ఒకదశలో హీరోనే సెల్ఫ్ ఎలివేషన్స్ ఇచ్చుకుంటాడు. గ్రిప్పింగ్ గా ఉండాల్సిన ట్రీట్మెంట్ ని కాస్త హీరో గారి గౌరవార్ధం అన్నట్టుగా డ్యాన్సులు, రొటీన్ ఎలివేషన్స్ కి వాడుకోవడం దెబ్బకొట్టింది. ఇది సుదీప్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్ ఏమో కానీ ఖైదీ లాంటి ప్యాక్డ్ యాక్షన్ ని చూద్దామని ఆశించి కూర్చున్న ఆడియన్స్ కి మాత్రం నిరాశపరుస్తుంది. పైగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ లు సైతం రిపీట్ గా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే లో కూడా సడన్ జంప్స్ ఇబ్బంది పెడతాయి. ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఓ ట్విస్ట్ బావున్నప్పటికీ అది ఎమోషనల్ గా కూర్చోలేదు.
కిచ్చా సుదీప్ లో మాస్ ని మరో స్థాయిలో చూపించే పాత్ర మ్యాక్స్. ఇలాంటి యాక్షన్ కథలు ఆయనకి బాగా నప్పుతాయి. హీరోయిజం ను నెక్స్ట్ లెవల్ లో ప్రదర్శించాడు. యాక్షన్ ఘట్టాలలో ఎనర్జిటిక్ గా కనిపించాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ ది నెగిటివ్ కాప్ రోల్. మొదట ఆ పాత్ర కథని మలుపుతిప్పుతుందని భావించినప్పటికీ చివర్లో తేలిపోయింది. ఇలవరసు క్యారెక్టర్ నిలబడింది. పోలీస్ స్టాప్ లో వుండే క్యారెక్టర్స్ భయానికీ, అయోమయానికి మధ్య కొట్టిమిట్టాడుతుంటాయి. సునీల్ పాత్రకు చాలా బిల్డప్ ఉంటుంది కానీ ఆ పాత్రలో థ్రిల్ ఏమీ వుండదు.
అజినీష్ లోక్ నాథ్ బీజీఎం మాత్రం ప్రత్యేకంగా నిలిస్తుంది. చాలా వరకూ యాక్షన్ థ్రిల్ ని ఆయన మ్యూజిక్ నిలబెట్టింది. రెండు పాటలు వున్నాయి. అవి అనవసరం. కెమరాపనితనం డీసెంట్ గా వుంది. యాక్షన్ కొరియోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. ఖైదీ లాంటి సెటప్ తో హై ఆక్టేవ్ యాక్షన్ సినిమా చేయాలనే ప్రయత్నం మ్యాక్స్ లో కనిపించింది. సెకండ్ హాఫ్ పై సరిగ్గా దృష్టి పెట్టినట్లేయితే ఆ ప్రయత్నం ఫలించేది.