హైదరాబాద్: దేశ వ్యాప్తంగా 8.6 లక్షల మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారని, దానిలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 1.56 లక్షలమంది ఉన్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కర్ణాటక, మహారాష్ట్ర రెండు, మూడు స్థానాలలో ఉన్నాయని వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కోరటంతో ప్రభుత్వం ఈ వివరాలను బయటపెట్టింది. 2009లో జరిపిన ఒక మ్యాపింగ్ స్టడీ ద్వారా ఈ గణాంకాలను నమోదు చేసినట్లు తెలిపింది. అయితే 19% సెక్స్ వర్కర్లు రిజిస్టర్ అవలేదని వెల్లడించింది. రాష్ట్రాల ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలు అందజేసిన సమాచారం ప్రకారం రిజిస్టర్ అయిన సెక్స్ వర్కర్ల సంఖ్య 6.96 లక్షలని తెలిపింది. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సదుపాయాలను గురించి కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఆ వృత్తిలోనుంచి బయటకు రావటానికి కౌన్సిలింగ్ ఇవ్వటం, లైంగికంగా సంక్రమించిన వ్యాధులకు చికిత్స, కండోమ్స్ వాడకంపై ప్రచారం, ఉచిత పంపిణీ వంటి సదుపాయాలను అందిస్తున్నట్లు తెలిపింది.