కీలకమైన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన జోష్ లో ఉంది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో మహా కూటమి ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితి మరింత బలపడతాయనే వాతావరణం కనిపిస్తోంది. అయితే, ఇదే సమయంలో… కాంగ్రెస్ కార్యక్రమాలకు ఈ మధ్య దూరంగా ఉంటూ అఖిలేష్ యాదవ్, మాయావతి. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థి అంటూ స్టాలిన్ అభిప్రాయపడితే… అది తమ అభిప్రాయం కాదని కూడా వీరు స్పందించారు. అంతేకాదు, ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీల మధ్య ప్రధానంగా సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఒక డీల్ అయిపోయిందనే కథనాలు వస్తున్నాయి. మొత్తం ఎనభై స్థానాలకుగాను… యూపీలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ 38, సమాజ్ వాదీ పార్టీ 35, ఆర్.ఎల్.డి. 4.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీలకు అమేథీ, రాయబరేలీ సీట్లను వదిలేద్దామనే నిర్ణయం అయిపోయిందట.
కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలనే నిర్ణయించేంత శక్తిగల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. గత ఎన్నికల్లో భాజపా ఇక్కడ భారీ సంఖ్యాలో స్థానాలు దక్కించుకుంది. కానీ, 2019 ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. అలాగని, దీన్ని కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చే ఉద్దేశమూ అఖిలేష్, మాయావతికి లేనట్టుగా ఉందనీ చెప్పుకోవచ్చు. ఆ మధ్య యూపీలో రెండు ఎంపీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసి భాజపాపై విజయం సాధించాయి. ఇప్పుడు అదే లెక్కల్లో… తమకు అత్యంత అనుకూలంగా ఉన్న పరిస్థితిని కాంగ్రెస్ విస్తరిలో ఎందుకు వడ్డించాలనే ఆలోచన వారిలో కనిపిస్తోంది. అందుకే, ఈ మధ్య కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్టుగా ఈ ఇద్దరూ వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు.
ఓరకంగా ఉత్తరప్రదేశ్ లో ఏర్పడ్డ ప్రత్యేక కూటమిగా ఈ సీట్ల సర్దుబాటు ప్రక్రియను చెప్పుకోవచ్చు. లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ పెద్ద సంఖ్యలో సీట్లు దక్కించుకుంటే… ఆ తరువాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో వీరు కచ్చితంగా కీలకపాత్ర పోషిస్తారు. అంటే, కాంగ్రెస్ కూటమికి వీరికి దక్కే సంఖ్యాబలంతో ఉన్న అవసరాన్ని బట్టీ, బేరసారాలు సాగించుకునే అవకాశాన్ని తమ చేతుల్లో ఉంచుకోవాలనేదే ఎస్పీ, బీఎస్పీ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ ఎన్నికలకు ముందే.. ఇతర ప్రాంతీయ పార్టీల మాదిరిగా కాంగ్రెస్ గూటికి చేరిపోతే.. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్పినట్టుగా నడుచుకుని, పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్య విషయంలో కూడా కాంగ్రెస్ మాటే వినాల్సి వస్తుంది. సో… దేశ రాజకీయాలకు కీలకమైన తమ రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తు అనే ఊసు ఎన్నికల ముందే లేకుండా చేసుకుంటే… ఆ తరువాత పరిస్థితి తమ చేతిలో ఉంటుంది… ఇదే మాయావతి, అఖిలేష్ వ్యూహంగా కనిపిస్తోంది