యూపీలో కూటమి ముక్కలైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల దెబ్బతో.. ఎస్పీతో దోస్తీకి కటీఫ్ చెప్పేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఎస్పీతో పొత్తు వల్ల ఉపయోగం లేదని అసలు యాదవుల ఓట్లు బీఎస్పీకి పడలేదని ఆమె ఫైరయ్యారు. త్వరలో యూపీలో జరిగనున్న 11 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించారు.
ఎస్పీ- బీఎస్పీని విడగొట్టడంలో బీజేపీ సక్సెస్..!
మోడీని ఓడించడమే లక్ష్యంగా ఎస్పీ బీఎస్పీలు చేతులు కలిపాయి. ముందుగా ఉపఎన్నికల్లో పొత్తు పెట్టుకుని సంచలన విజయాలు నమోదు చేశారు. ఆ ఉత్సాహంతో.. లోక్‌సభ ఎన్నికల్లోనూ పొత్తులు పెట్టుకున్నారు. కానీ అసలు ఎన్నికల్లో రెండు పార్టీలు ఘోరంగా ఓడిపోయాయి. చెరో 38 స్థానాల్లో పోటీ చేశాయి. బీఎస్పీ పది చోట్ల, ఎస్పీ ఐదు చోట్ల విజయం సాధించారు. నిజానికి బీఎస్పీకి ఒక్క సిట్టింగ్ సీటు కూడా లేదు. అయినా పది చోట్ల విజయం సాధించింది. ఎస్పీకి ఐదుగురు ఎంపీలు ఉంటే… తిరిగి ఐదింటిని మాత్రమే గెలవగలిగింది. అంటే నష్టపోయింది ఎస్పీనే. కానీ మాయావతి మాత్రం ఇక అఖిలేష్‌తో పని లేదని తేల్చి చెప్పేస్తున్నారు.
మాయవతి ప్రధాని కాలేదు..! అఖిలేష్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించరు..!
ఎస్పీ నుంచి యాదవుల ఓట్లు బీఎస్పీ రాలేదు. అస్సలు సమాజ్‌వాదీ పార్టీకే యాదవుల ఓట్లు పడలేదని మాయావతి తేల్చిచెప్పారంటున్నారు. అంటే.. ఎస్పీ పని అయిపోయిందని.. ఆమె నేరుగా చెప్పడం. సమాజ్‌వాదీ పార్టీ ఓట్ బ్యాంక్‌ను శివపాల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ చీల్చాయని.. ఇక నుంచి సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు అక్కర్లేదనేశారు మాయావతి. ఇక నుంచి సొంతంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఇది ఇపుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి మాయావతిని ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అఖిలేష్ యాదవ్. కేంద్రంలో మాయావతికి సమాజ్‌వాదీ పార్టీ సహకరించాలని, రాష్ట్రంలో ఎస్పీకి బీఎస్పీ సహకరించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు మాయావతి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి సహకరించడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. అందుకే కటీఫ్ చెప్పేశారు.
మళ్లీ విపక్షాలన్నీ కకావికలం..!
యూపీలో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. 62 స్థానాలు బీజేపీ గెలిచింది. ఇక కేంద్రంలో బీజేపీ సంఖ్య 303కి చేరింది ఈ సమయంలో బీఎస్పీ కేంద్రంలో చేసేదేమీ లేదు. అందుకే మళ్లీ యూపీపై దృష్టి సారించారు మాయావతి. అందుకే కలిసిరాని పొత్తును వదిలించుకోవాలని చెబుతున్నారు. అదే సమయంలో.. ఆమె నిర్ణయం వెనుక.. బీజేపీ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయానికి విపక్షాలన్నీ కలసి కట్టుగా ఉంటే.. మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అందుకే.. బీజేపీ మహాఘట్ బంధన్ కకావికలం కావడంలో కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు