ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కులం కార్డును కూడా ఈ ఎన్నికల ప్రచారంలో తెరమీదికి తెచ్చిన సంగతి తెలిసిందే. తాను బీసీ కులానికి చెందినవాడననీ, తనకేం జరిగినా భరిస్తానుగానీ, బీసీలకు అన్యాయం జరిగితే సహించనంటూ తీవ్ర భావోద్వేగాలతో చాలా చోట్ల ప్రసంగాలు గుప్పించారు మోడీ. ఇదే అంశమై మరోసారి స్పందించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజమైన బీసీ కాదని ఆమె అన్నారు. ఒకవేళ ఆయన ఓబీసీకి చెందినవారే అయి ఉంటే… ఆర్.ఎస్.ఎస్. ఆయనకి ప్రాధాన్యత ఇవ్వదనీ, ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన పేరును తెరమీదికి తీసుకొచ్చేవారు కాదని ఆమె విమర్శించారు. బీసీలను ప్రధాని చేసే పరిస్థితి అక్కడ ఉండదన్నారు.
పుట్టుకతోనే మోడీ బీసీ అయి ఉంటే, దేశంలో వెనకబడిన వర్గాల ప్రజలు పడే కష్టాలు ఆయనకి అర్థమయ్యేవని మాయావతి అన్నారు. మోడీ మరోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఇప్పుడు లేవనీ, కానీ మళ్లీ తానే ప్రధాని కాబోతున్నా అనే కలలు ఆయన కంటున్నారని మాయావతి ఎద్దేవా చేశారు. ఇప్పుడు భాజపా ఓటమి అంచున ఉందనీ, అందుకే ప్రధానమంత్రిలో అసహనం పెరిగిపోయి ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే తన కులాన్ని వెనకబడిన వర్గాల జాబితాలో మోడీ చేర్చుకున్నారని మాయావతి అన్నారు.
నిజానికి, కుల రాజకీయాల్లోకి తనను లాగొద్దంటూ ఆ చర్చను ప్రారంభించిందే నరేంద్ర మోడీ! ప్రధానమంత్రి స్థాయిలో నాయకుడు, కులాల ప్రస్థావన తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో ప్రసంగాలు చేయడం కచ్చితంగా దిగజారుడుతనమే. ఐదేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించి, తద్వారా మరోసారి ప్రజల అభిమానం చూరగొని అధికారంలోకి రాగలమనే ధీమా భాజపాకి మొదట్నుంచీ లేదనేది… ఆ పార్టీ ప్రచార సరళిని చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోయింది. ఐదు దశల ఎన్నికల తరువాత ఆ పార్టీ నేతల ప్రచారంలో మారిన పంథా చూసినా ఆ పరిస్థితి అర్థమౌతుంది. తాను బీసీని అని చెప్పడమే కాకుండా… చివరికి మహాత్మాగాంధీ కూడా బనియా కులానికి చెందినవాడంటూ ఢిల్లీలో వ్యాపారులతో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ వ్యాఖ్యానించిన సందర్భమూ ఉంది. మరి, దీన్ని ప్రజలు ఎలా తీసుకున్నారో, ఎలాంటి తీర్పు ఇచ్చారో అనేది త్వరలో తేలిపోతుంది.